విజేత ఎవరో!
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే
● బరిలో ఐదుగురు
● ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ
● జేఎన్‌టీయూకేలో నేడు ఓట్ల లెక్కింపు
● పూర్తయిన ఏర్పాట్లు
● మొత్తం లెక్కించే ఓట్లు 15,502
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉపాధ్యాయ వర్గ ప్రతినిధిగా రాష్ట్ర పెద్దల సభకు వెళ్లేది ఎవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. రాష్ట్ర శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో విజేత ఎవరనే సస్పెన్స్ వీడిపోనుంది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. ఏలూరుకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. మిగిలి ఉన్న రెండేళ్ల పదవీ కాలానికి గత గురువారం ఎన్నికలు నిర్వహించారు. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 116 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 92.62 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 16,737 ఓటర్లకు గాను 15,502 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతలను నిర్దేశించే ఓటర్ల మనోగతం కాకినాడ జేఎన్‌టీయూలోని అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో భద్రంగా ఉంది. ఈ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఓట్లను లెక్కించిన అనంతరం ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి వెల్లడించనున్నారు.
14 టేబుళ్లు.. 9 రౌండ్లు..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జేఎన్‌టీయూకేలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం పోలైన ఓట్లను 9 రౌండ్లలో లెక్కించనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి దశలో ప్రాథమిక ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం, సమగ్ర లెక్కింపు ప్రక్రియ చేపడతారు. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయ్యింది. ఓట్ల లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఇప్పటికే సూచించారు.
అభ్యర్థుల ఎదురు చూపులు
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచినా.. పోలింగ్ సరళిని బట్టి ప్రధాన పోరు మాత్రం ఇద్దరి మధ్యనే జరిగిందనే స్పష్టమైంది. బొర్రా గోపిమూర్తి (భీమవరం), గంధం నారాయణరావు (ద్రాక్షారామ), పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి (విల్ల లక్ష్మి) ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఈ అయిదుగురు అభ్యర్థుల్లో ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తి మధ్యనే పోటీ నెలకొంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వీరిద్దరూ అన్ని స్థాయిల్లో పోటాపోటీగా ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడిన గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏది ఎలా ఉన్నా తెల్లవారితే తేలనున్న ఫలితం కోసం అభ్యర్థులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
జేఎన్‌టీయూకేలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూమును కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామగ్రిని, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు.
జిల్లాల వారీగా మొత్తం ఓట్లు, లెక్కించే ఓట్ల వివరాలు
జిల్లా మొత్తం లెక్కించే శాతం
ఓట్లు ఓట్లు
కాకినాడ 3,418 3,118 91.22
తూర్పు గోదావరి 2,990 2,753 92.07
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 3,296 3,138 95.21
అల్లూరి సీతారామరాజు 637 565 88.70
పశ్చిమ గోదావరి 3,729 3,484 93.43
ఏలూరు 2,667 2,444 91.64
Comments
Please login to add a commentAdd a comment