చెత్త సృష్టి.. సంపద వట్టి! | - | Sakshi
Sakshi News home page

చెత్త సృష్టి.. సంపద వట్టి!

Published Tue, Dec 10 2024 4:44 AM | Last Updated on Tue, Dec 10 2024 4:44 AM

చెత్త

చెత్త సృష్టి.. సంపద వట్టి!

జిల్లాలో 345 పంచాయతీలు

268 సంపద కేంద్రాలు

198 పనిచేస్తున్నాయంటున్న అధికారులు

వాస్తవంగా పనిచేసేది పది శాతం మాత్రమే

కంపోస్టు ఉత్పత్తి శూన్యం

సాక్షి, అమలాపురం: గ్రామ పంచాయతీలలో ఒకవైపు కొండలా పేరుకుపోతున్న చెత్తను తగ్గించుకోవడం.. మరోవైపు నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారు చేయడం... వాటి అమ్మకాల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవడం.. ఇలా మూడు లక్ష్యాలతో మొదలు పెట్టిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాలో 345 పంచాయతీలున్నాయి. వీటి ద్వారా రోజుకు వంద టన్నుల మేర చెత్త వస్తోందని అంచనా. మేజర్‌ పంచాయతీల్లో రెండు నుంచి మూడు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇదే ఇప్పుడు పంచాయతీలకు పెద్ద సమస్యగా మారింది. డంపింగ్‌ యార్డులు లేకపోవడంతో రోడ్డు చెంతన, పంట కాలువల చెంతన చెత్త వదిలేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం పెరిగి జనం రోగాల బారిన పడుతున్నారు. కొన్ని పంచాయతీలు చెత్తను కాల్చి బూడిద చేస్తున్నాయి. దీనివల్ల చెత్త సమస్య తగ్గినా ప్లాస్టిక్‌, టైర్లు వంటి వాటిని కూడా తగలబెట్టడం వల్ల విషవాయువులు గాలిలో కలిసి జనం ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి చెత్తతో సంపద కేంద్రాలు చాలా వరకు అక్కరకు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేశారు. జిల్లాలో 268 సంపద కేంద్రాలున్నాయి. వీటిలో 198 కేంద్రాలు పనిచేస్తున్నాయని, 46 పాక్షికంగా పని చేస్తున్నాయని, 25 కేంద్రాలలో వానపాముల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు. కాని వాస్తవంగా పది శాతం కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఈ కారణంగా పంచాయతీల్లో ఆశించిన స్థాయిలో చెత్త సమస్య తీరడం లేదు. అలాగే ఆదాయం కూడా రావడం లేదు.

సంపద కేంద్రాల ద్వారా చెత్త సమస్యకు పరిష్కారం

సంపద కేంద్రాల ద్వారా నెలకు సగటున నాలుగు టన్నుల వర్మీ కంపోస్టు తయారవుతోందని అంచనా. ఈ విధంగా చూస్తే ఏడాదికి 48 టన్నులు. కేజీ రూ.పది చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఏడాదికి రూ.4.80 లక్షల వరకు ఆదాయంగా వస్తోంది. జిల్లాలో మూడోవంతు పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కన్నా ఇది ఎక్కువ. కంపోస్టు తయారీకి సగటున నెలకు 16 టన్నుల చెత్తను వినియోగిస్తారు. ఈ విధంగా చూస్తే ఏడాదిలో సుమారు 192 టన్నుల చెత్తను కంపోస్టుగా మార్చవచ్చు. చిన్నిచిన్న పంచాయతీలకు చెత్త సమస్య దాదాపు తీరిపోతుంది. మీడియం, మేజర్‌ పంచాయతీలలో ఊరి చివర్లలోను, పంట కాలువల చెంతా చెత్త కొండల్లా పేర్చాల్సిన అవసరం తప్పుతుంది. డంపింగ్‌ యార్డు సమస్యలు సైతం చాలా వరకు తీరతాయి.

పంచాయతీల నిర్లక్ష్యం

● పంచాయతీ పాలకవర్గాలు, అధికారులు, పారిశుధ్య సిబ్బందిలో చిత్త శుద్ధి లేకుండా పోయింది. కంపోస్టు తయారీని పక్కన పెడుతున్నారు. చాలా పంచాయతీలకు పారిశుధ్య సిబ్బంది లేకపోవడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

● అన్నీ ఉన్నచోట సిబ్బందిలో చిత్తశుద్ధి లేదు. సంపద కేంద్రాలు ఎంతోకొంత పనిచేస్తున్న చోట నాణ్యమైన కంపోస్టు ఉత్పత్తి జరగడం లేదు. వానపాములు తరచూ చనిపోతున్నాయి. ఈ కారణంగా కంపోస్టు కావడం లేదు.

● కార్మికులకు కంపోస్టు తయారీపై శ్రద్ధ లేకుండా పోవడం కూడా ఒక కారణం. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్‌, గాజు సీసాలు, ఐరన్‌, ఇతర వ్యర్థాలు అన్నీ కలిసి సంపద కేంద్రాల వద్దకు వస్తున్నాయి. వీటిని వేరు చేసి కంపోస్టు తయారీకి అవసరమైన వ్యర్థాల సేకరణకు సరిపడా సిబ్బంది లేకుండా పోయారు.

● కంపోస్టు కేంద్రాల్లో సిమెంట్‌ కుండీల తయారీ కంపోస్టుకు అనుకూలం కాదు. నాణ్యమైన కంపోస్టు తయారు కావాలంటే అడుగు ఎత్తున సిమెంట్‌ కుండీ నిర్మాణం చేయాలి. కాని కుండీ ఎత్తు రెండు, మూడు అడుగులు ఉండడం వల్ల కంపోస్టు అనుకున్న నాణ్యతతో రావడం లేదు.

● కంపోస్టుకు ఉపయోగించే వానపాములు నాన్‌ బోరియింగ్‌ రకానికి చెందినవి. ఇది తక్కువ ఎత్తు ఉన్న చెత్త, ఇతర వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తాయి. అధిక ఎత్తు ఉంటే మాత్రం అనుకున్నంత వేగంగా కంపోస్టు తయారు చేయడం లేదు.

● సంపద కేంద్రాల వద్ద అమ్మకాలు చేసే కంపోస్టును రెండవ సారి కొనుగోలు చేసేవారు లేకుండా పోతున్నారు. దీంతో తయారైన అరకొర కంపోస్టును సైతం వాడేవారు లేక పంచాయతీలకు వచ్చే కొద్దిపాటి ఆదాయం కూడా రావడం లేదు.

కొత్తపేట నియోజకవర్గంలో 57 పంచాయతీలు ఉండగా, వీటిలో 20 మేజర్‌వి. వీటిలో రెండింటికి మాత్రమే డంపింగ్‌ యార్డులు ఉండగా, మిగిలిన వాటికి లేవు. ఇక్కడ చెత్త సమస్య అధికంగా ఉంది. 34 సంపద కేంద్రాలుండగా, కేవలం 11 మాత్రమే పనిచేస్తున్నాయి.

అమలాపురం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు 60 కాగా, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, భీమనపల్లి, ఎన్‌.కొత్తపల్లి మేజర్‌ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఉన్నా ఉపయోగం లేదు. అమలాపురం మండలంలో 12 గ్రామాల్లో చెత్త నుంచి సంపద కేంద్రాలలో ఐదు పనిచేస్తున్నాయి.

చెత్త సమస్య పరిష్కారాలకు ఇది మంచి ప్రయత్నం

బండారులంక మేజర్‌ పంచాయతీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చెత్త. దీని పరిష్కారానికి డంపింగ్‌ యార్డు అతి ముఖ్యమైంది. సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తే చాలా వరకు చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పంచాయతీలకు ఆదాయం కూడా వస్తుంది. – దైవాపు పూర్ణిమ, సామాజిక కార్యకర్త, బండారులంక, అమలాపురం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
చెత్త సృష్టి.. సంపద వట్టి!1
1/4

చెత్త సృష్టి.. సంపద వట్టి!

చెత్త సృష్టి.. సంపద వట్టి!2
2/4

చెత్త సృష్టి.. సంపద వట్టి!

చెత్త సృష్టి.. సంపద వట్టి!3
3/4

చెత్త సృష్టి.. సంపద వట్టి!

చెత్త సృష్టి.. సంపద వట్టి!4
4/4

చెత్త సృష్టి.. సంపద వట్టి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement