విజేత.. భీమవరం బుల్లోడే!
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపిమూర్తి
ఫ తొలి ప్రాధాన్య ఓట్లలోనే గెలుపు
ఫ బడి నుంచి మండలికి పయనం
ఫ ఆరు గంటల్లోనే ముగిసిన ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉత్కంఠగా సాగిన గురువుల పోరులో భీమవరం బుల్లోడు విజేతగా నిలిచారు. ఆరు జిల్లాల పరిధిలో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బొర్రా గోపిమూర్తి గెలుపొందారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల బరిలోకి దిగేందుకు తన వృత్తికి రాజీనామా చేశారు. గోపిమూర్తికి ప్రధాన ప్రత్యర్థిగా ద్రాక్షారామకు చెందిన గంధం నారాయణరావు బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ మిగిలిన ముగ్గురూ నామమాత్రమైన పోటీకే పరిమితమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి చివరి వరకూ బొర్రా, గంధం మధ్యనే నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ కనిపించింది. చివరకు యూటీఎఫ్, పీడీఎఫ్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన గోపిమూర్తికి విజయం వరించింది. గత ఎన్నికల్లో సైతం నారాయణరావు పీడీఎఫ్ అభ్యర్థితో తలపడ్డారు.
సాబ్జీ మృతితో..
శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. మిగిలిన రెండున్నరేళ్ల పదవీ కాలానికి ఎన్నికల కమిషన్ ఈ ఎన్నిక నిర్వహించింది.
ఆది నుంచీ ఉత్కంఠగా..
ఈ ఎన్నికలు ఆది నుంచీ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు (రంపచోడవరం) జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు 15,494 ఓట్లు పోలయ్యాయి. చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లను ప్రామాణికంగా తీసుకుని కోటా ఓట్లను 7,341గా నిర్ణయించారు. గోపిమూర్తికి తొలి రౌండ్‌లోనే కోటా ఓట్లు దక్కాయి. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఎన్నికల కమిషన్ ఆమోదంతో ప్రకటించి, ధ్రువీకరణ పత్రం అందజేశారు. గోపీమూర్తికి 9,165 ఓట్లు పోలవగా, రెండో స్థానంలో ఉన్న నారాయణరావు 5,259 ఓట్లు దక్కించుకున్నారు. దీంతో 3,906 ఓట్ల ఆధిక్యతతో గోపిమూర్తిని విజయం వరించింది. యూటీఎఫ్, పీడీఎఫ్ ఉమ్మడిగా బలపరిచిన గోపీమూర్తి వెంట ఆ రెండు సంఘాల ప్రతినిధులు విస్తృత ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. సిట్టింగ్ స్థానంపై పట్టు సాధించాలని ఉపాధ్యాయులు కలసికట్టుగా పని చేసినా.. ప్రధాన పోటీదారుగా నిలిచిన గంధం నారాయణరావు చివరి వరకూ గట్టి పోటీయే ఇచ్చారు. రెండున్నరేళ్ల పదవీ కాలానికి జరిగిన ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ చివరకు తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది.
ఎన్నికల పరిశీలకుడు కె.హర్షవర్ధన్, కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. 14 టేబుళ్లపై 76 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాకినాడ ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు, కేఎస్‌ఈజెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామలక్ష్మి, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర పాల్గొన్నారు.
ఆరు గంటల్లోనే లెక్క తేలింది
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆరు గంటల్లోనే ముగిసింది. కాకినాడ జేఎన్‌టీయూ అంబేడ్కర్ లైబ్రరీలో సోమవారం ఉదయం 8 గంటలకు మొదలై, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. తొలి రౌండ్‌లోనే మొదటి ప్రాధాన్యతా ఓట్లకే కోటా ఓట్లు రావడంతో గోపిమూర్తిని విజయం వరించింది.
ఎవరికెన్ని ఓట్లంటే..
బొర్రా గోపిమూర్తి 9,165
గంధం నారాయణరావు 5,259
దీపక్ పులుగు 102
నామన వెంకటలక్ష్మి (విళ్ల లక్ష్మి) 81
డాక్టర్ నాగేశ్వరరావు కవల 73
Comments
Please login to add a commentAdd a comment