వక్ఫ్ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా
అధ్యక్షుడు ఖాదర్
అమలాపురం టౌన్: రాష్ట్రంలో వక్ఫ్ చట్టా న్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేస్తోందని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు అమలాపురంలో ఖాదర్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ముస్లిం, మైనార్టీలను అణగదొక్కే కుట్రలో భాగంగా వక్ఫ్ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ సవరణ బిల్లుతో రాష్ట్రంలోని ముస్లింలకు భవిష్యత్‌లో ఇబ్బందులు అనివార్యం కాగలవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించకుండా ముస్లింల మనోభావాలకు కాపాడాలని ఖాదర్ డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించి ముస్లింకు అండగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటుకు కూడా ఓ పద్ధతి, విధానం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమర్థమైన వక్ఫ్ బోర్డును నియమించి వక్ఫ్ ఆస్తులను సంరక్షించాలని ఖాదర్ డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తల ఊపకూడదని, అందులోని లోపాలను ఎత్తిచూపి బిల్లును వ్యతిరేకించి ముస్లింలకు భరోసాగా నిలవాలని కోరారు.
మత్స్యకారుల ధర్నా
గెద్దనపల్లిలో నష్టపరిహారం నిధులు
దుర్వినియోగం చేశారని ఆరోపణ
అమలాపురం రూరల్: కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో మత్స్యకారుల నష్టపరిహారం నిధులు కొంతమంది దుర్వినియోగం చేశారని సంఘం నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రిలయన్స్, ఓఎన్జీసీ మత్స్యకారులకు చెల్లించిన నష్టపరిహారం ఎన్‌ఎఫ్‌డీసీ నిధులను కొందరు నాయకులు స్వాహా చేశారని గెద్దనపల్లి రామాలయం మత్స్యకారుల కుటుంబాలు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించాయి. ఐదు విడతలు సమానంగా పంచవలసిన సొమ్ము ను, కేవలం రెండుసార్లే పంచి, మూడు విడతల డబ్బును పంచకుండా తమను వేధిస్తున్నారని గెద్దనపల్లి అగ్నికుల క్షత్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పంచమంటే గొడవలకు దిగి తమను వేధిస్తున్నారని కలెక్టర్ మహేష్‌కుమార్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. గతంలో ఽఅధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వం తమకు తక్షణం నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక పది మంది నాయకుల కనుసన్నల్లో ఈ దారుణం జరుగుతోందని, విచారణ చేసి బాధితులకు రూ.80 లక్షల పరిహారం అందజేయాలని సంఘం నాయకుడు నారాయణ డిమాండ్ చేశారు.
కౌశల్‌జిల్లా స్థాయి విజేతలు
అమలాపురం టౌన్: ఈ నెల 6న ఆన్‌లైన్‌లో జరిగిన కౌశల్ –2024 జిల్లా స్థాయి పరీక్షల ఫలితాలను డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 8,9,10 తరగతుల విద్యార్థుల విభాగాల విజేతలు విజయవాడలో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి కౌశల్–2024 పరీక్షల్లో సత్తా చాటనున్నారని తెలిపారు. ఎనిమిదో తరగతికి సంబంధించి క్విజ్ విభాగంలో ఎం.వెంకటరమణ (జెడ్పీ ఉన్నత పాఠశాల – మురమళ్ల) ప్రథమ, ఉంగరాల విశిష్ట నాగ సూర్య ప్రజ్ఞ (ఎస్‌జీ ఎంపీఎల్ హైస్కూలు– అంకసాని చెరువు), ద్వితీయ స్థానాలు సాధించారు. పోస్టర్ విభాగంలో జక్కంపూడి తులసీ చందు (ఎంపీఎల్ హైస్కూలు –కొంకాపల్లి), సవరపు రష్మిత (జెడ్పీహెచ్‌ఎస్– గొల్లవిల్లి), ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 9వ తరగతి క్విజ్ విభాగంలో దూడల హాసిని (ఎంపీఎల్ హెచ్‌ఎస్ – కొంకాపల్లి), పి.శ్రీరమ్య (జెడ్పీహెచ్‌ఎస్ – జి.పల్లిపాలెం), ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. పోస్టర్ విభాగంలో పి.లక్ష్మిశ్రీ (జెడ్పీహెచ్‌ఎస్– జి.పల్లిపాలెం), ఆర్.కీర్తి (జెడ్పీహెచ్‌ఎస్ (జి) సూర్యనగర్ గెలిచారు. 10వ తరగతి క్విజ్ విభాగంలో పడాల లోకేశ్వర్‌రెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్– మాచవరం), , ఒగ్గు కుశ్వంత్‌సాయి (జెడ్పీహెచ్‌ఎస్– మాచవరం) ద్వితీయ స్థానాలు సాధించారు. రీల్స్ విభాగంలో కారెం రేష్మశ్రీ (ఎంపీఎల్ హెచ్‌ఎస్– కొంకాపల్లి), సుతాపల్లి దేవ హర్ష నాగశ్రీ సందీప్ (ఎస్‌కేపీజీఎన్ గవర్నమెంట్ హెచ్‌ఎస్ –రామచంద్రపురం), ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. వీరికి రూ.1,500, 1,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తామని డీఈవో సలీమ్ బాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment