గడువులోపు అర్జీల పరిష్కారం
కలెక్టర్ మహేష్‌కుమార్ సూచన
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలను రీ ఓపెన్‌కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డ్వామా పీడీ మధుసూదన్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరాణి 168 అర్జీలు స్వీకరించారు. సామాజిక భద్రత పింఛన్ల మంజూరు, వైద్య సేవల కల్పన, భూ సమస్యలు తదితర అంశాలపై అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అందిన అర్జీ సర్వీస్ అంశమా లేదా ఫిర్యాదా అనేది గమనించి కచ్చితమైన విశ్లేషణ చేస్తూ సంబంధిత విభాగాలకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని, అధికారులు పరిష్కారం దిశగా గడువు లోపు చర్యలు చేపట్టాలన్నారు. పరిష్కారం కాని వాటి గురించి ఫిర్యాదుదారులతో చర్చించి తిరస్కరణకు గల కారణాలను తెలియజేయాలన్నారు.
భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు
భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా ఈ నెల10 నుంచి జనవరి 8 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ సదస్సులపై నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు తహసీల్దారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు రోజూ సదస్సుల నిర్వహణ తీరును, ఆర్డీవోలు రోజుకు రెండు సదస్సులను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. రీ సర్వే జరగని గ్రామాలలో తొలుత ఈ సదస్సులు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్లు రెవెన్యూ ఇన్‌సెక్టర్లు, వీఆర్వోలు, సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వ్యవసాయ, మత్స్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 25 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారుల వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. రామచంద్రపురానికి చెందిన ఓ ప్రేమ జంట ఎస్పీని ఆశ్రయించారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని విన్నవించుకున్నారు. తమ కుటుంబీకులు, బంధువుల నుంచి తమను కాపాడాలని వారు అభ్యర్థించారు. అర్జీదారుల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని ఎస్పీ కృష్ణారావు ఆయా పోలీసు స్టేషన్ల సీఐ, ఎస్సైలకు ఫోన్ చేసి ఆదేశించారు. వచ్చిన 25 అర్జీల్లో సగం వరకూ కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించినవే ఉండడంతో అర్జీదారులతో ఎస్పీ మాట్లాడి సమస్య పరిష్కారానికి మార్గాలను సూచించారు. ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్య పరిష్కార వేదిక మహిళా ఎస్సై శశాంక ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment