భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
కలెక్టర్ మహేష్‌కుమార్
ముమ్మిడివరం: భూ హక్కుల పరిరక్షణ, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం చినకొత్తలంకలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్‌డీఓ కె.మాధవిలతో కలిసి గ్రామసభలో ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, శాశ్వత రికార్డుల కౌంటర్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల నిర్వహణా ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డు పరిష్కారానికి ముందుగా గ్రామస్తులు ఈ సదస్సులో అర్జీని నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్థలం సేకరించి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. ఈ సదస్సులలో అర్జీలకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదన్నారు. వినతుల్లో ఎక్కువ భాగం భూసమస్యలేనని ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేసి సమస్య పరిష్కరిస్తామని, జటిలమైన వాటిని నిర్దేశిత ప్రోసిజర్ ప్రకారం తదుపరి పరిష్కరిస్తామన్నారు. ఈ సదస్సులో మండల ప్రత్యేకాధికారి డీసీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ సుబ్బలక్ష్మి, ఎంపీడీఓ టి.వెంకటాచార్య, వీఆర్వోలు పాల్గొన్నారు.
కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే పనుల పూర్తికి వినతి
సాక్షి, అమలాపురం: కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ జీఎం హరీష్ బాలయోగి, టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు, సహచర ఎంపీలతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవిని మంగళవారం ఢిల్లీలో కలసి కోరారు. కోనసీమ జిల్లాలో రైల్వే అభివృద్ధి కోసం లేఖ అందించారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులలో కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే లైన్ ఒకటి అని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామం నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామం వరకు ఫేజ్–1 (255.435 సెంట్లు) భూసేకరణ పూర్తయింది. రెండవ దశ కింద వంతెనల నిర్మాణానికి 24.10 సెంట్ల భూమిని సేకరించారు. ఈ పంట తర్వాత ఆ భూమిని రైల్వే శాఖకు అప్పగిస్తామని తెలిపారు. అమలాపురం మున్సిపాలిటీ కాంప్లెక్స్‌లో పూర్తి స్థాయిలో పనిచేసే రైల్వే కౌంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్
సాక్షి అమలాపురం: పంజాబ్ రాష్ట్రంలో దేవిందర్‌సింగ్ ఇతరులు వేసిన సివిల్ అప్పీల్‌పై ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప వర్గీకరణపై విచారణ చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్‌మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారిణి పి.జ్యోతిలక్ష్మి తెలిపారు. ఏకసభ్య కమిషన్ కార్యాలయం విజయవాడలో కోనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజపురం, 520010. గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయ మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారన్నారు. కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకు వ్యక్తిగతంగా లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టరు పోస్టు లేదా ఈ మెయిల్ ఐడీ omcscsubclassification@gmail.com ద్వారా జనవరి 9వ తేదీలోపు సమర్పించవచ్చు.
సామాజిక పింఛన్ల పరిశీలన
అల్లవరం: మండలంలోని గోడి పంచాయతీలో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో సామాజిక పింఛన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశాలతో డీఆర్‌డీఓ పీడీ శివశంకర ప్రసాద్ పర్యవేక్షణలో ఈఓపీఆర్‌డీ, వెల్ఫేర్ అసిస్టెంట్లు బృందాలుగా ఏర్పడి సోమవారం వివిధ రకాల పింఛన్లను పరిశీలించారు. లబ్ధిదారుల వద్దకు పింఛన్ పరిశీలన బృందాలు వెళ్లి వారికి వస్తున్న ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేశారు. వృద్ధాప్యం, వితంతువుల, ఒంటరి మహిళ, డప్పు కార్మికులు, వికలాంగ తదితర పింఛన్లపై పరిశీలన చేశారు. 403 పింఛన్లకుగాను నలుగురు చనిపోగా, ఆరుగురు అందుబాటులో లేరని గుర్తించారు. మిగిలిన పింఛన్లను క్షుణ్ణంగా పరిశీలించి యాప్‌లో సిబ్బంది నమోదు చేశారని పీడీ శివశంకర ప్రసాద్ తెలిపారు. డీపీఎం అన్నపూర్ణ, ఎంపీడీఓ కృష్ణమోహన్, ఎంపీఎం సయ్యద్, కార్యదర్శి రామకృష్ణ, సర్పంచ్ తోట శ్రీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment