అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ప్రారంభం
● వర్చువల్ విధానంలో ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
● దశాబ్ధాల కల నెరవేరిందని రామచంద్రపురం న్యాయవాదుల ఆనందం
రామచంద్రపురం: రామచంద్రపురం కోర్టుల ప్రాంగణంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఆంధ్రపదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభించారు. ముందుగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రిబ్బన్ కత్తిరించి కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానంలో శిలా ఫలకాన్ని ఆవిష్కరించి నూతన జిల్లా కోర్టును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను, గొప్ప వ్యక్తుల ను అందించిన ఘన చరిత్ర తూర్పుగోదావరి జిల్లాకు ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర హైకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు సేవలందించారన్నారు. రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించే బాధ ఇక్కడి సుమారు 250 మంది న్యాయవాదులకు, కక్షిదారులకు తప్పిందన్నారు. సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇక్కడి నుంచి హైకోర్టుకు మరింత మంది జడ్జిలుగా రావాలని ఆకాంక్షించారు. జిల్లా కోర్టు ఏర్పాటు సందర్భంగా న్యాయమూర్తులు, బార్ అసో సియేషన్, న్యాయవాదులు అందరికీ అభినందనలు తెలిపారు. జిల్లా పోర్టుపోలియో జడ్జి అయినాల జయసూర్య మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు ఈ కోర్డు పునాది వేసిందని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ 8 మండలాలు, 10 పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి, అనపర్తి, ఆలమూరు కోర్టులకు సంబంధించి అప్పీళ్లు అన్నీ ఇకపై ఈ కోర్టులోనే చేసుకోవచ్చని తెలిపారు. కాకినాడ నాల్గవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం. హరినారాయణకు ఈ కోర్టును నిర్వహించే బాధ్యతను చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అప్పగించారు. సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్వరరావు, జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.నాగేశ్వరరావు నాయక్, బార్ అసోసియేషన్ కార్యదర్శి వాడ్రేవు సాయిప్రసాద్, ఉపాధ్యక్షుడు పలివె ల సత్యనారాయణ, డీఎస్‌ఎస్ శర్మ, సంయుక్త కార్యదర్శి చిన్నం వీరెడ్డి, కోశాధికారి జె. చక్రవర్తి, మహిళా న్యాయవాదుల ప్రతినిధి కేవీ సత్యవాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment