అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు
మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించిన వైనం
అల్లవరం: కొమరగిరిపట్నం సముద్ర తీర ప్రాంతం అక్రమ ఇసుక రవాణాకు అడ్డగా మారింది. తీరం పొడవునా ఉన్న సముద్ర ఇసుకను రేయింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల కళ్ల ముందే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ కార్యకర్తలు ఇసుక దందాకు పాల్పడుతున్నారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం శివారు సముద్రం తీరం నుంచి సోమవారం రాత్రి మూడు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ట్రాక్టర్లని అడ్డుకుని అల్లవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 3న కొమరగిపట్నం శివారు ప్రాంతాల నుంచి అఽనధికారింగా ఇసుకను తరలిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన యువకులు అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తే అమలాపురానికి చెందిన టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ రవాణాపై కేసు నమోదు చేయకుండా తిరిగి పంపించేశారు. మళ్లీ వారం రోజుల వ్యవధిలో రెండో సారి మూడు ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై అల్లవరం ఎస్సై హరీష్‌కుమార్‌ని వివరణ కోరగా సముద్ర ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని, దానిపై చర్యలు తీసుకోవల్సింది ఆయనేనని తెలిపారు. తహసీల్దార్ వీవీఎల్ నరసింహరావుని వివరణ కోరగా ఎస్సైతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment