గీత దాటితే కఠిన చర్యలు
ఎస్పీ కృష్ణారావు వెల్లడి
అమలాపురం టౌన్: ఈ నెల 31వ తేదీ మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఇయర్ ఎండింగ్ పేరుతో నిర్వహించుకునే ఏ వేడుకై నా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిఘాలో భాగంగా 120 పోలీస్ పికెట్‌లు, 40 మొబైల్ పార్టీలు నిరంతరాయంగా గస్తీ కాస్తాయని స్పష్టం చేశారు. అమలాపురం, మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, రావులపాలెం, రాజోలు, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో నిఘా మరింత విస్తృతం చేసినట్లు ఎస్పీ వివరించారు. సాధ్యమైనంత వరకూ ఇయిర్ ఎండింగ్, కొత్త సంవత్సరానికి స్వాగత ఏర్పాట్లు ఇళ్ల వద్ద జరుపుకోవాలని సూచించారు. వేడుకల పేరుతో రోడ్డుపైకి వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కార్మిక మంత్రి ఇలాకాలోనే
పేపర్ లీకేజీ మూలాలు
రామచంద్రపురం రూరల్: ఈ నెల 16న జరగాల్సిన సమ్మేటివ్–1 పరీక్ష గణితం పేపరు ముందు రోజే యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో 6 నుంచి 10వ తరగతి వరకూ నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, తీగ లాగితే.. జిల్లాలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం జెడ్పీ హైస్కూల్‌లో లీకేజీ తంతు జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ పాఠశాలలో సోషల్ సబ్జెక్టు బోధిస్తున్న ఉపాధ్యాయుడు తీపర్తి వెంకట సుబ్బారావును, ఎంఈఓ కార్యాలయంలో బఫర్ స్టాక్ నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించి, కస్టోడియన్‌గా ఉండే ఎంఈఓ మానుపూడి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని అమరావతి సైబర్ పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో పేపర్ లీకేజీ జరగడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment