రత్నగిరిపై డిజిటల్ పేమెంట్ల కౌంటర్
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో డిజిటల్ పేమెంట్ల కౌంటర్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రత్నగిరిపై పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న వ్రతాలు, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కౌంటర్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ ను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు ప్రారంభించారు. మొదటిగా భక్తుడు, స్థానిక వ్యాపారి వీర్ల రాంబాబు రూ.2 వేల వ్రతం టికెట్టును డిజిటల్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కౌంటర్లో ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, క్రెడిట్, డెబిట్ కార్డులతో సత్యదేవుని వ్రతం, దర్శనం, లక్ష్మీ ప్రయుక్త ఆయుష్య హోమం, ప్రత్యంగిర హోమం (అడ్వాన్స్) టికెట్లు కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కౌంటర్‌ను ప్రారంభించగా.. చాలా మంది భక్తులు నగదు కన్నా డిజిటిల్ పద్ధతిలో టికెట్లు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపించారని అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం నుంచే పీఆర్ఓ కార్యాలయంలోని కౌంటర్లో డిజిటల్ పేమెంట్ల ద్వారా ప్రయోగాత్మకంగా టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ రోజు నుంచే డిజిటల్ పేమెంట్ల ద్వారా టికెట్ల విక్రయాలు అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. డిజిటల్ పేమెంట్ల కౌంటర్ ద్వారా తొలి రోజు రూ.97,708 ఆదాయం వచ్చింది. వ్రతం రూ.300 టిక్కెట్లు 34, రూ.1,000 టికెట్లు 12, రూ.1,500 టికెట్లు 16, లక్ష్మీ ప్రయుక్త ఆయుష్య హోమం ఆన్లైన్లో రూ.1,116 చొప్పున రెండు, స్వయంగా ఆచరించేందుకు రూ.1,000 చొప్పున మూడు టిక్కెట్ల భక్తులు కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment