జొన్నాడ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించండి : కలెక్టర్
అమలాపురం రూరల్: జొన్నాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో పునః ప్రారంభించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో ఆయన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫిబ్రవరి 14, 15, తేదీల్లో ఫ్లై ఓవర్ పనులను తిరిగి పరిశీలిస్తారని, అప్పటిలోగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా పథక సంచాలకుడు డి.సురేంద్రనాథ్, సృష్టి కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్.రామకృష్ణ పాల్గొన్నారు.
సదుపాయాలపై సర్వే
జిల్లాలోని సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సదుపాయాలు, ఆధునీకరణకు చేపట్టిన సర్వే ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లు సంక్షేమ వసతి గృహ అధికారులతో చేపట్టిన సర్వే నివేదికలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. పునః పరిశీలించి పూర్తి స్పష్టతతో అంచనాలు రూపొందించాలన్నారు. విద్యా సంక్షేమ శాఖ డివిజనల్ ఇంజినీర్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
భారత ప్రభుత్వ కార్మిక శాఖ అసంఘటిత రంగ ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సభ్యత్వాలు లేని కార్మికుల సంక్షేమానికి కాంక్షిస్తూ ఈ–శ్రమ్ పోర్టల్‌ను ప్రవేశ పెట్టిందని కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కంటింజెంట్ ఎన్‌ఎంఆర్, పారిశుధ్య ఎస్‌ఐపీఎఫ్ లేని అసంఘటిత కార్మికుల వివరాలు సేకరించాలని అన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేస్తూ కార్డులు జనరేట్ చేస్తే ప్రమాద బీమా రూ.రెండు లక్షల వరకూ ఉచితంగా పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. సహాయ లేబర్ కమిషనర్ టి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment