ఖండవల్లిలో ఆరబోసిన ధాన్యం
●
● ఈ రబీలో దిగుబడులు సూపర్
● ఎకరానికి 60 నుంచి 70 బస్తాలు
● కలిసొచ్చిన సర్కారు ముందస్తు ప్రణాళిక
● అన్నదాతలు హర్షాతిరేకం
పెరవలి: ఈ రబీలో వరిపంటకు సంబంధించి ఊహించని దిగుబడులు వస్తున్నాయి. ఎకరానికి 60 నుండి 70 బస్తాలు దిగుబడి రావటంతో రైతుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. అకాల వర్షాలు కంగారు పెట్టించినా నష్టాలు పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా ప్రభావంగా మూడేళ్లుగా 40 నుండి 50 బస్తాలు దిగుబడులు వచ్చాయి. ఈసారి నీటి ఇబ్బందులు లేకుండా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. సాగుకు ఇదెంతో దోహదపడింది. జిల్లాలోలక్షా 76వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. నిడదవోలు నియోజక వర్గంలోనే 36,500 ఎకరాల్లో సాగు చేశారు. నియోజక వర్గంలో ఎక్కడ చూచినా దిగుబడుల గురించే రైతులు మాట్లాడుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా కూడా దిగుబడులు బాగానే వస్తున్నాయి. పెరవలి మండలంలో 8వేల ఎకరాల్లో సాగు చేపట్టగా 70 శాతం మాసూళ్ళు పూర్తి అవ్వగా వీటి నుండి దిగుబడి 60 నుండి 70 బస్తాల మేర పంటకోత ప్రయోగాల్లో నిర్దారణయింది.
ప్రభుత్వ చర్యలు భేష్
● సీజన్ ప్రారంభంలో సాగు నీరు ఇబ్బంది తలెత్తుతుందని ముందే గ్రహించిన ప్రభుత్వం అందుకు ప్రణాళిక రూపొందించింది.
● సీలేరు జలాలు తీసుకురావటంతో పాటు నీరు వృథా కాకుండా మురుగు కాల్వలకు అడ్డుకట్టలు వేయించగలిగింది.
● కాలువల్లో నీరు సమృద్దిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది.
● ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరాకు వంతుల వారీ విధానం ప్రవేశపెట్టింది. దీనివల్ల సాగు నీటి ఇబ్బంది కలుగలేదు.
● ఇబ్బంది ఉన్న మెరక ప్రాంతాలలో కాలువల్లో ఇంజిన్ల ద్వారా సాగు నీరు అందించింది. ఉచితంగా డీజిల్ సరఫరా చేసింది.
● ఎరువులు సకాలంలో అందించగలిగారు. వాతావరణం అనుకూలించింది.
● సకాలంలో నాట్లు పడటం, తెగుళ్లు అంతంత మాత్రంగా ఆశించటం వంటి కారణాలతో పెట్టుబడి తగ్గి దిగుబడి పెరిగిందని రైతులు విశ్లేషిస్తున్నారు.
నష్టాలను పూడ్చుకుంటాం
ఈ ఏడాది సార్వా సాగు అంతంత మాత్రంగా ఉన్నా దాల్వా సాగు దిగుబడులు చాలా బాగున్నాయి. ఎకరానికి 60 నుండి 70 బస్తాలు వస్తున్నాయి. గత నష్టాలను పూడ్చుకుంటాం.
– పీతాని రమణమూర్తి, పెరవలి
ఉచితంగా డీజిల్
రబీ వరిసాగులో సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించారు. నీరు తోడుకోవటానికి డీజిల్ అందించారు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందింది. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు.
– బొంతు రాంబాబు, ముక్కామల
Comments
Please login to add a commentAdd a comment