ఎన్టీఆర్ చోద్యసేవ!
● పథకం నిర్వీర్యానికి కూటమి
ప్రభుత్వం కుట్ర
● ఇప్పటికే ఈహెచ్‌ఎస్ సేవలు నిలిపివేత
● జిల్లాలో రూ.80 కోట్ల మేర పేరుకుపోయిన ఎన్‌టీఆర్ వైద్యసేవ బిల్లులు
● చికిత్స అందించేందుకు
ముందుకురాని ఆస్పత్రులు
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో
పథకం సక్రమంగా అమలు
సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం, శస్త్ర చికిత్సలు ఉచితంగా అందించాలనే తలంపుతో అమలవుతున్న పథకంపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్పు చేసింది. తాజాగా పథకాన్ని నిర్వీర్యం చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పద్ధతిని తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉద్దేశ పూర్వకంగానే ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆస్పత్రులకు అందాల్సిన బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం నిరుపేదలకు ఇబ్బందిగా మారుతోంది. తాము రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోవాలంటే ఎలాగన్న ప్రశ్న తలెత్తుతోంది.
రూ.80 కోట్ల బకాయిలు
తెల్ల రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ వర్తింప చేస్తోంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే క్రమంలో జిల్లా వ్యాప్తంగా 90 ఆస్పత్రులను ఎంపిక చేసింది. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 40 ఉండగా.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా హాస్పిటల్ 1, మరో 3 ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. 16 దంత వైద్యశాలలు(ఈహెచ్‌ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్పత్రులకు బిల్లులను చెల్లించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ వస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు సుమారుగా రూ.80 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిణామం ఆస్పత్రుల యాజమాన్యాలకు గుదిబండగా మారింది. ఎన్టీఆర్ వైద్యసేవ కేసులంటేనే ఎందుకులే అన్న భావన కలుగుతోంది. గుండె సంబంధిత, చర్మం, ఈఎన్‌టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూత్రపిండ శస్త్ర చికిత్సలు తదితర ఆపరేషన్లు చేసిన ఆస్పత్రులకు బిల్లులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో జరిగిన వైద్యానికి ఎలాంటి చెల్లింపులూ చేపట్టలేదు. ఈ పరిణామం పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఖరీదైన శస్త్ర చికిత్స తాము ఎలా చేయించుకోవాలంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈహెచ్‌ఎస్ సేవలు ఆగిపోయాయి. ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ వైద్య సేవలు సక్రమంగా అందకపోతే తమ పరిస్థితేంటన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
బీమాగా మార్చే యోచన?
ఎన్టీఆర్ పథకాన్ని మార్పు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. బీమా క్లెయిమ్‌ల విషయంలో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది.
గతంలో ఊపిరి
దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులతో ప్రారంభమైన పథకంలో 3,275 వ్యాధుల వరకు విస్తరించారు. ఆస్పత్రుల్లో మార్గదర్శకాలు సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. డ్యూటీ డాక్టర్, స్పెషలిస్టు వైద్యులతో పాటు నర్సు, పారా మెడికల్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. రోగులకు నాణ్యమైన మందులు, పౌష్టికాహారం అందేలా చూశారు. ఆరోగ్యమిత్రతో కూడిన హెల్ప్‌డెస్క్ తప్పనిసరిగా ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకు చికిత్సను నిరాకరిస్తే ఆయా నెట్‌వర్క్ ఆస్పత్రులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఇలాంటివేమీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
రూ.508.49 కోట్లు వెచ్చింపు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పథకం అమలుకు భారీగా ఖర్చు చేసింది. రూ.508.49 కోట్లు వైద్యం, శస్త్రచికిత్సలకు వెచ్చించింది. 2,48,805 మందికి వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసింది. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం స్కీం వర్తింపచేసింది. గుండె, లివర్ ప్లాంటేషన్, క్యాన్సర్ వంటి ఖరీదైన శస్త్ర చికిత్సలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.
ఖరీదైన వ్యాధులకు నిధులు
మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలతో ఖరీదైన వ్యాధులకు సైతం చికిత్స చేయించే వెసులుబాటు కలిగింది. బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్‌కు రూ.11.97 లక్షలు, ఆల్లోజెనిక్ బోన్‌మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ రూ.11 లక్షలు, గుండె మార్పిడి రూ.10.77 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇలాంటి వ్యాధులు సైతం ఆరోగ్యశ్రీలో నయా పైసా చెల్లించకుండా చికిత్స చేయించే వెసులుబాటు కలిగింది.
జిల్లాలో గత ప్రభుత్వంలో వెచ్చించిన మొత్తం.. వివరాలు ఇలా..
సంవత్సరం వైద్యం, వెచ్చించిన మొత్తం
శస్త్రచికిత్సలు (రూ.కోట్లల్లో)
చేయించుకున్న వారు
2019–2020 25,750 62.71
2020–2021 29,602 62.15
2021–2022 47,039 89.48
2022–2023 1,46,414 294.15
Comments
Please login to add a commentAdd a comment