రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్‌పీఎస్)లో డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ (డీఆర్‌పీ)గా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ, సెర్ఫ్ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్(పీఎంఎఫ్‌ఎంఈ)ని సమర్థంగా అమలు చేసేందుకు మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేస్తామన్నారు. ఏదైనా డిగ్రీ చదివి, కంప్యూటర్, ఇంటర్‌నెట్ వినియోగంలో ప్రావీణ్యం ఉండి, సొంత స్మార్ట్‌ఫోన్ కలిగి, ప్రయాణాలు చేయడంలో ఆసక్తి ఉన్న పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు అర్హులని పేర్కొన్నారు. 21 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సు కల్గి ఉండాలన్నారు.రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా డీఆర్‌పీలను ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 23వ తేదీ గురువారం బొమ్మూరులోని నేక్‌స్కిల్‌కాలేజీలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. గ్రౌండింగ్ చేసిన యూనిట్ల ప్రాతిపదికన ఒక్కొక్క యూనిట్‌కు రూ.20,000 చెల్లింపు పూర్తిగా ప్రోత్సాహక ప్రాతిపదిక ఇన్సెంటివ్ ఇస్తారని పేర్కొన్నారు. వివరాలకు 89198 68419, 90309 24569, 99635 90429 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
రెవెన్యూ సేవలో
జవాబుదారీతనం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రెవెన్యూ సేవలు అందించే క్రమంలో అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్వో టి.సీతారామమూర్తితో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడంలో భాగంగా ఎక్కువ మొత్తంలో రెవెన్యూ పరమైన అంశాలపై అర్జీలను స్వీకరించడం, పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాల్సింది ఉందన్నారు. వీటిలో ఎక్కువగా ఐదు కేటగిరిలకి చెందిన అర్జీలు ఉన్నాయన్నారు. జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం వచ్చే వారితో ఆప్యాయతతో వ్యవహరిస్తే పరిపాలన యంత్రాంగంపై గౌరవం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఆర్డీవో అధ్వర్యంలో మండలాల వారీగా ఫిర్యాదులు పరిష్కార విధానంపై ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
పథకాలు ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రదర్శించేలా గణతంత్ర వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కలక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాహారంగా గణతంత్ర దినోత్సవ శకటాల ప్రదర్శన, స్టాల్స్ ప్రదర్శన ఉండాలన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల ఆకర్షణీయంగా, దేశ భక్తి, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి దాయకంగా నిలిచేలా ప్రదర్శనలు ఉండాలనీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment