పథకం వేశారు.. దొంగిలించారు
నిడదవోలు: జల్సాలకు అలవాటు పడిన వారు చోరీలు చేయాలని పథకం వేశారు.. ఓ వృద్ధురాలి మెడలో బంగారు ఆభరణాలు అపహరించి, చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఆ వివరాలను గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ పీవీజీ తిలక్ విలేకర్లకు వెల్లడించారు. నిందితులు భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన చెల్లుబోయిన సత్యనారాయణ, పెరవలి మండలం కానూరు అగ్రహారానికి చెందిన పాక వీరస్వామిలు 2007లో దుబాయ్‌లో తాపీపని చేసేవారు. అక్కడ సంపాదించిన డబ్బులు చెడు వ్యసనాలకు ఖర్చు పెట్టారు. దీంతో వీరిద్దరూ అప్పుల పాలయ్యారు. ఏదొక దొంగతనం చేసి అప్పులు తీర్చాలని పథకం వేశారు. పాక వీరస్వామి పట్టణంలోని గాంధీనగర్‌లో వీధి వీధిన తిరిగి ఉల్లిపాయల వ్యాపారం చేశాడు. ఈ సమయంలో ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నూలి రామారావు, అన్నపూర్ణలు ఉంటున్నారని గ్రహించాడు. ఉల్లిపాయలు అమ్మే క్రమంలో అన్నపూర్ణ మెడలో బంగారం ఎక్కువగా ఉందని గుర్తించాడు. ఈ విషయాన్ని చెల్లుబోయిన సత్యనారాయణకు చెప్పాడు. బంగారం దొంగలించాలని ఇద్దరూ పథకం వేశారు. ఈ విషయాన్ని చెల్లుబోయిన సత్యనారాయణకు తమ్ముడు వరసైన ఉండి మండలం మహదేవీపట్నం గ్రామానికి చెందిన సంమింగి సన్యాసిరావుకు చెప్పారు. దీంతో ఈ నెల 8న ఎవరూ సంచరించని సమయంలో పాక వీరస్వామి తన ఉల్లిపాయల ఆటోను తీసుకువచ్చి వృద్ధురాలు అన్నపూర్ణ ఇంటి ముందు పెట్టాడు. ఆటోలో స్పీకర్ ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తున్నట్లు గట్టిగా సౌండ్ పెట్టాడు. ఇంతలో సంమింగి సన్యాసిరావు, చెల్లుబోయిన సత్యనారాయణలు మోటార్ సైకిల్‌పై వృద్ధురాలి ఇంటికి వచ్చారు. సత్యనారాయణ గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించి, ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. బిల్డింగ్‌లో ఖాళీగా ఉన్న రెండో పోర్సన్ చూపించే క్రమంలో ఇద్దరూ లోపలకు వెళ్లారు. సత్యనారాయణ వృద్ధురాలు అన్నపూర్ణ మెడలో ఉన్న రెండు పేటల బంగారు గొలుసు లాక్కుని బయటకు వచ్చాడు. అప్పటికే సన్యాసిరావు బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉండటంతో ఇద్దరూ కలసి వెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు గురువారం కంసాలపాలెం గ్రామ శివారున చెల్లబోయిన సత్యనారాయణ, పాక వీరస్వామి, సంమింగి సన్యాసిరావులను అరెస్టు చేశారు. వీరి నుంచి 43 గ్రాముల రెండు పేటల బంగానే గొలుసును స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో పట్టణ ఎస్సై పి.శోభన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
చివరికి పోలీసులకు చిక్కిన ముగ్గురు
Comments
Please login to add a commentAdd a comment