చిల్లర కష్టాలు
ఫ మార్కెట్లో రూ.10, రూ.20 నోట్ల కొరత
ఫ నాణేలు తీసుకోవడానికి నిరాకరిస్తున్న వ్యాపారులు
ఫ ప్రజల్లో అనుమానాలు
ఫ ఆర్‌బీఐ నివృత్తి చేసినా తప్పని చిక్కులు
రాజమహేంద్రవరం రూరల్: కొద్ది రోజులుగా చిల్లర కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నాళ్లుగా రూ.10, రూ.20 నోట్ల లభ్యత తగ్గింది. దీంతో రైతుబజారులో కూరగాయలు, మార్కెట్‌లో వివిధ వస్తువుల కొనుగోలుకు వెళ్తున్న వారు చిల్లర సమస్యతో సతమతమవుతున్నారు. కొద్ది సంవత్సరాల కిందట పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మొదట రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ.2 వేల నోట్లు ప్రవేశపెట్టింది. ఆ తర్వాత పాత రూ.500 నోట్లు కూడా రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త డిజైన్‌తో నోట్లు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటితో పాటు రూ.10, రూ.20 నాణేలు కూడా ప్రవేశపెట్టారు. ఈవిధంగా దేఽశీయ కరెన్సీలో దశాబ్ద కాలంగా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.
తరచూ మార్పులతో సందేహాలు
రూపాయి నోటు నుంచి రూ.2 వేల నోటు వరకూ విభిన్న రంగులు, డిజైన్లలో నోట్లు చలామణీలోకి వచ్చాయి. అయితే, నాణేల నుంచి నోట్ల వరకూ డిజైన్లలో తరచూ జరుగుతున్న మార్పుల ప్రజల్లో పలు సందేహాలకు తావిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం రూ.10, రూ.20 నాణేలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. అయినప్పటికీ, బరువు, చెల్లుబాటు అవుతాయో లేదోననే సందేహంతో వీటిని తీసుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా కాలం నుంచి మార్కెట్‌లోకి రూ.10, రూ.20 నాణేలు రావడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో మార్కెట్‌లో రూ.10, రూ.20 నోట్లకు కూడా కొరత ఏర్పడింది. ఫలితంగా ప్రజలను చిల్లర కష్టాలు వేధిస్తున్నాయి. చాలాచోట్ల డిజిటల్ పేమెంట్లు చేస్తున్నప్పటికీ.. వీటిపై అవగాహన లేని కొంతమంది చిరు వ్యాపారులు, బడ్డీ కొట్ల వారు నగదు లావాదేవీలకే పరిమితమవుతూ చిల్లర కోసం కుస్తీలు పడుతున్నారు. ప్రభుత్వం ఆమోదించిన నాణేలను తిరస్కరించడం నేరమని, రూ.10, రూ.20 నాణేలు చెల్లుబాటు అవుతాయని, ఎవరైనా తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్–124 కింద ఫిర్యాదు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయి
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన నాణేలు రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 అన్నీ చెల్లుబాటు అవుతాయి. రోజువారీ క్రయవిక్రయాలకు వ్యాపారులు వీటిని నిరభ్యంతరంగా వినియోగించవచ్చు. ప్రభుత్వం ఆమోదించిన నాణేలను క్రయవిక్రయాలకు నిరాకరించడం చట్ట రీత్యా నేరం. వారిపై ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటాం.
– డీవీ ప్రసాద్,
లీడ్ బ్యాంక్ మేనేజర్,
తూర్పు గోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment