జల్సాల కోసం చోరీల బాట
● పోలీసులకు పట్టుబడిన నలుగురు యువకులు
● 29 మోటార్ సైకిళ్లు స్వాధీనం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జల్సాలు, దుర్వ్యసనాలకు గురైన నలుగురు యువకులు చోరీల బాట పట్టారు. అనేక ద్విచక్ర వాహనాలను దొంగిలించి, తుదకు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మైనర్లు కావడం విశేషం. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్‌బాబు, ఇన్‌స్పెక్టర్ వి.అప్పారావు వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లో ఇటీవల మోటార్ సైకిళ్ల దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఎస్పీ డి.నరసింహ కిషోర్ పర్యవేక్షణలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిఘా పెంచారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్‌బాబు ఆధ్వర్యంలో త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు సిబ్బందితో కలిసి కాతేరు గామన్ వంతెన వద్ద బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. నలుగురు యువకులు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా తారసపడడంతో, వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీశారు. వీరిలో వీవర్స్‌కాలనీకి చెందిన కుప్పం తేజతో పాటు, మరో ముగ్గురు మైనర్లు ఉన్నారు. వీరు జల్సాలు, దురలవాట్లకు బానిసలై, డబ్బు కోసం మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడ్డారు. ఇళ్ల ముందు, ఇతర ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను మారు తాళంతో తీసి, వాటిని కొంతకాలం దాచిపెట్టారు. వాటిని ఒక్కొక్కటిగా అమ్మి,, వచ్చిన డబ్బుతో అవసరాలు తీర్చుకునేవారు. వీరితో పాటు కొంతమూరుకు చెందిన శ్రీరామ్ అనే యువకుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. వీరంతా రూ.11.60 లక్షల విలువైన 29 మోటార్ సైకిళ్లను దొంగిలించారు. కొన్ని మోటార్ సైకిళ్లను కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన వాడబోయిన రమేష్, గుర్రాల వెంకన్న, దేవేన రాజు అనే వ్యక్తులకు అమ్మారు. మిగిలిన వాటిని రాజమహేంద్రవరం క్వారీ గోతుల వద్ద దాచారు. వీరి నుంచి 29 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కుప్పం తేజను న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించగా, ముగ్గురు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. ఇలా ఉండగా యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా వారి తల్లిదండ్రులు, పెద్దల పర్యవేక్షణ ఉండా లని ఎస్పీ నరసింహకిషోర్ చెప్పా రు. ఎప్పటికప్పుడు వారి నడవడికపై దృష్టి పెట్టాలన్నారు. కేసులో విశేష కృషి చేసి న డీఎస్పీ రమేష్‌బాబు, ఇన్‌స్పెక్టర్ అప్పారావు, ఎస్సై అప్పలరాజు హెచ్‌సీలు టి.లోవకుమార్, ఎం.వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు విజయ్, పవన్, కె. శ్రీనివాసరావును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment