బాలుడి మృతదేహం లభ్యం
కారు ప్రమాదంలో మూడుకు చేరిన మృతులు
పి.గన్నవరం: ఊడిమూడి శివారు ఆర్పీ రోడ్డులో చింతావారిపేట వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రధాన పంట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన నేలపూడి మనోజ్(5) మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ ప్రమాదంలో కాలువలో పడి తల్లితో పాటు, ఇద్దరు కుమారులు మరణించడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన నేలపూడి విజయకుమార్ తన భార్య ఉమ(31), కుమారులు రోహిత్(9), మనోజ్(5) అరకు నుంచి ఇంటికి తిరిగొస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు చింతావారిపేట వద్ద అదుపుతప్పి ప్రధాన పంట కాలువలోకి దూసుకెళ్లిన విషయం విదితమే. తల్లి ఉమ, పెద్ద కుమారుడు రోహిత్ మృతదేహాలు అదే రోజు లభ్యం కాగా, చిన్న కొడుకు మనోజ్ మృతదేహం సంఘటన స్థలికి వంద మీటర్ల దిగువన బుధవారం లభ్యమైంది. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఎస్సై బి.శివకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
ఈ ఘటనలో భార్య, ఇద్దరు కుమారులను కోల్పోయిన బాధితుడు విజయకుమార్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోతవరంలో బాధిత కుటుంబాన్ని బుధవారం ఆమె పరామర్శించారు. సర్పంచ్ వడలి కొండయ్య, మాజీ సర్పంచ్ గుత్తుల దాసు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment