వెదజల్లుతో సిరుల పంట
నీటి యాజమాన్యం ఇలా..
విత్తిన తర్వాత మొక్కలు మొదటి ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు (సుమారు 7–10 రోజులు) నీరు నిల్వ ఉండకుండా, పొలం తడిగా ఉంచాలి (ఆరుతడులు ఇవ్వాలి). మొక్క 4, 5 ఆకులు తొడిగిన తర్వాత పొలంలో పలచగా అంటే 2, 3 సెం.మీ. లోతు నీరుంచాలి. అంతకుమించి నీరు ఎక్కువగా ఉంటే పైరు దుబ్బు చేయదు. పైరు పిలక తొడిగి దుబ్బు కట్టుట పూర్తయ్యాక కోతకు పది రోజుల ముందు వరకు మడిలో 5 సెం.మీ. లోతు నీరుంచాలి.
కరప: జిల్లావ్యాప్తంగా గడచిన కొన్నేళ్లుగా వరి సాగులో వెదజల్లు పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది. వరి సాగులో నారు మడి పెంచి, నాట్లు వేయకుండా నేరుగా విత్తే పద్ధతి (వెదజల్లు) పాటిస్తే, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చు. ఈ పద్ధతి వల్ల వరి నారు పెంచడానికి, నాట్లు వేయడానికి ఖర్చు ఆదా అవుతుంది. సాగునీరు కూడా ఎక్కువ అవసరం ఉండ దు, పంట కాలం ఏడు నుంచి పది రోజులు తగ్గుతుందని కరప సబ్ డివిజన్ ఏడీఏ కె.బాబూరావు, ఎంఏఓ ఏవీ రాజేష్ వివరించారు. వెదజల్లు పద్ధతి అనుసరించే రైతులకు జాగ్రత్తలు తెలిపారు. సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే, అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.
ప్రయోజనాలివే..
ఎకరానికి 12 కిలోల విత్తనాలు చల్లితే సరిపోతుంది. 15 నుంచి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయి. పంట కాలం వారం నుంచి పది రోజులు తగ్గుతుంది. ఆకు పెంచడం, ఆకుతీత, నాట్లు వేసే పని ఉండదు, రూ 10 వేల సాగు ఖర్చు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వల్ల దిగుబడి 10 నుంచి 15 శాతం పెరుగుతుంది. సాగునీరు ఆదా అవుతుంది. ఈ పద్ధతిలో మడిలో సూర్యరశ్మి, గాలి బాగా సోకి, చీడపీడల బెడద బాగా తగ్గి, తద్వారా సస్యరక్షణ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.
నేల తయారీ
విత్తడానికి వారం, పది రోజులు ముందుగా దమ్ము చేసి పొలాన్ని తయారుచేయాలి. చివరి దమ్ము చేసిన తర్వాత పొలంలో ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చదును చేసుకోవాలి. మట్టి పేరుకున్న తర్వాత, బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. వంతున కాలువలు ఏర్పాటుచేయాలి. వీటిద్వారా ఎక్కువగా ఉన్న నీరు, మురుగు నీరు బయటకు పోవడానికి వీలవుతుంది.
విత్తనాల రకాలు
ఈ రబీలో ఎంటీయూ 3626(బొండాలు), ఎంసీ 15(టాటా బొండాలు), ఆర్‌ఎన్‌ఆర్ 15048, ఎన్‌ఎల్‌ఆర్–34449(నెల్లూరు సన్నాలు) అనువైనవి.
విత్తన శుద్ధి, విత్తు విధానం
వెదజల్లు పద్ధతిలో రకాన్ని బట్టి ఎకరానికి 12 కిలోల వరకు విత్తనం అవసరం అవుతుంది. వెదజల్లే విధానంలో విత్తే ముందు ఒక కిలో విత్తనానికి ఒక గ్రాము బావిస్టిన్ కానీ, 8 గ్రాముల సూడోమోనస్ పొడి మందు ఒక లీటరు నీటిలో కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నాన పెట్టాలి. 24 గంటలు మండికట్టి మొలకెత్తిన విత్తనాన్ని పొలంలో సమానంగా పడేలా వెదజల్లుకోవచ్చు.
డ్రమ్ము సీడర్‌తో విత్తితే..
పంట తొలి దశలో వరసల మధ్య కోనోవీడర్‌ను వాడి కలుపు మొక్కలను నేలలో తొక్కివేయవచ్చు. కలుపు మందు వేసిన 4, 5 రోజుల వరకు నీరు బయటకు పోకుండా చూడాలి.
సస్యరక్షణ
నేరుగా విత్తే పద్ధతిలో పురుగులు, తెగుళ్ల తాకిడి తక్కువగా ఉంటుంది. మొక్కకు గాలి, వెలుతురు బాగా ప్రసరించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, అందువల్ల సస్యరక్షణకు అయ్యే ఖర్చు కూ డా తగ్గుతుంది. అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆయా సమయాల్లో వ్యవసాయ నిపుణులను సంప్రదించి, వారి సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ఈ సాగు విధానంలో ప్రయోజనాలెన్నో..!
పెట్టుబడులు, సాగునీరు ఆదా
పది రోజుల పాటు తగ్గనున్న పంటకాలం
కలుపు యాజమాన్యం
నేరుగా విత్తే పద్ధతిలో పండించే పొలాల్లో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. సరైన సమయంలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. విత్తిన 35–40 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 1–10 రోజుల మధ్య ఎరేజ్–ఎన్, సిరియస్ 400 మి.లీ.+12 గ్రాములు లేదా ఎరాస్ గోల్డ్ 800 గ్రాములు లేదా కౌన్సిల్ యాక్టివ్ 90 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి, ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. వరి నాటిన, వెదజల్లిన 15–25 రోజుల మధ్య నోవ్‌లెక్ట్ 500 మి.లీ లేదా నామినీ గోల్డ్ 100 మి.లీ లేదా ఆల్‌మిక్స్ 8 గ్రాములు లేదా సాధీ 80 గ్రాములు లేదా వివాయా ఒక లీటరు మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి.
ఎరువుల నిర్వహణ
నాట్ల పద్ధతిలో వేసే విధంగానే ఎరువులు వేయాలి. సిఫార్సు చేసిన ఎరువుల్లో పూర్తి భాస్వరాన్ని, సగం పొటాష్ ఎరువును దమ్ములో వేయాలి. సిఫార్సు చేసిన నత్రజని(యూరియా) ఎరువును మూడు సమ భాగాలు చేసి, విత్తిన 15 రోజుల్లోపు, పిలకలు తొడిగే దశలో, అంకురం ఏర్పడే దశలో వేయాలి. దమ్ములో నత్రజనిని వేయరాదు. ఎందుకంటే కలుపు ఎక్కువగా వస్తుంది. మిగిలిన సగం పొటాష్‌ను అంకురం ఏర్పడే దశలో నత్రజనితో కలిపి వేయాలి. దాళ్వాలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ దమ్ములో వేయాలి. పైరుపై జింక్‌లోపం కనిపిస్తే.. జింక్ సల్ఫేట్ 2.5 గ్రాములు ఒక లీటరు నీరు వంతున కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment