పరువు నష్టం దావా వేస్తా..
ఫ ఆరోపణలు కాదు.. సాక్ష్యాధారాలతో నిరూపించండి
ఫ గౌతమి సూపర్ బజార్ భూమి లీజు ఆరోపణలపై మాజీ ఎంపీ మార్గాని మండిపాటు
ఫ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అసత్య ప్రచారంపై ఆగ్రహం
రాజమహేంద్రవరం సిటీ: గౌతమీ సూపర్ బజార్ భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేశానని, లీజు విషయంలో తాను రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజమూ లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఈ ఆరోపణలు అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. అధికారంలో ఉన్నందున ఆరోపణలు చేయడం కాకుండా సాక్ష్యాధారాలతో నిరూపించాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అధికార మదంతో, భుజాలు చరుచుకుని వాసు అసత్య ప్రచారం చేస్తే, చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఎమ్మెల్యే కదా ఎలాగైనా మాట్లాడవచ్చని అనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఆదిరెడ్డి కుటుంబం మాదిరిగా తాను ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని భరత్‌రామ్ స్పష్టం చేశారు. అవినీతికి అడ్డాగా కార్పొరేషన్‌ను మార్చుకుని, అడ్డగోలు వ్యవహారాలు, అక్రమ సంపాదనతో పేదల పొట్ట కొట్టిన చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానికే ఉందని మార్గాని ఆరోపించారు. ఈవీఎంల మాయాజాలంతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి వాసు.. జాతీయ రహదారి పక్కన ఇసుక స్టాక్ పాయింట్ వద్ద రూ.10 కోట్ల విలువైన ఇసుకను హాంఫట్ చేసి, దందాకు తెర లేపారన్నారు. అలాగే, మద్యం దుకాణాలు, బార్ల కేటాయింపుల్లో భారీగా కమీషన్లు తీసుకున్నారని, సిండికేట్లతో కుమ్మకై ్క తన అనుయాయులకు షాపులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోడానికే గౌతమీ సూపర్‌బజార్ భూమి విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. ఆదిరెడ్డి వాసు ఒకపక్క సెటిల్‌మెంట్ల దందాలు చేస్తూ, మరోపక్క క్వారీ ఏరియాలో పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ, ఎదుటి వారిపై బురద జల్లడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీగా ఐదేళ్లు నీతి, నిజాయితీతో అభివృద్ధే అజెండాగా పని చేశానని చెప్పారు. అయినప్పటికీ ఓర్వలేక తాను 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు అప్పట్లో తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం చేశారని అన్నారు. నిజానికి ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే ఆదిరెడ్డి వాసు కార్పొరేషన్‌లో అవినీతికి తెర లేపారని అన్నారు. మెయిన్ రోడ్డులో వ్యాపారులను బెదిరించి చీటీలు వేయిస్తున్నారని భరత్‌రామ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment