మృతదేహాలపై పడి భోరున విలపించిన భర్త
విషాదం మిగిల్చిన విహార యాత్ర
పంట కాలువలోకి దూసుకుపోయిన కారు
భార్య, కుమారుడు మృతి, చిన్న కుమారుడి గల్లంతు
నిద్ర మత్తు వల్లే ప్రమాదం?
లే ఉమా.. లేరా పెద్దోడా అంటూ అతడు భార్య, కుమారుడి మృతదేహాల వద్ద విలపించిన తీరు చూపరులను కలచి వేసింది. కోనసీమ జిల్లా ఊడిమూడి శివారు చింతావారిపేట వద్ద పంట కాలువలోకి కారు బోల్తా కొట్టిన ఘటన అతనికి తీవ్ర విషాదం మిగిల్చింది. అప్పట్లో కరోనా అతని ఉపాధిని దూరం చేయగా ఇప్పుడు జరిగిన ప్రమాదం భార్యను, కుమారుడిని శాశ్వతంగా దూరం చేసింది. విధి.. హృదయ విదారకంగా ఆడిన చదరంగం అతడికి నిండుశోకాన్ని మిగిల్చింది. భార్యాపిల్లలతో విహారయాత్రకని వెళ్లిన అతడు బతుకు యాత్రలో ఒంటరి అయిపోయాడు. అయినవారు పంట కాలువలో పడి కళ్ల ఎదుటే మునిగిపోతున్నా రక్షించుకోలేని నిస్సహాయ స్థితి అతని దుఃఖాన్ని కట్టలు తెంచుకొనేలా చేసింది.
పి.గన్నవరం: కరోనా సమయంలో ప్రయివేటు పాఠశాలలు మూత పడటంతో అతడికి టీచర్ ఉద్యోగం పోయింది. జీవనాధారం లేకపోవడంతో కారును కొనుక్కుని డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. చివరికి అదే కారు మృత్యువు రూపంలో ఆ కుటుంబాన్ని కాటు వేయడంతో అతడు దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. కళ్ల ఎదుటే భార్య, ఇద్దరు కుమారులు నీట మునిగిపోతుండటంతో కాపాడుకోలేక పోయానంటూ భర్త విజయకుమార్ విలపించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. నిస్సహాయ స్థితిలో అతడు భార్య, కుమారుని మృతదేహాలపై పడి బోరున విలపించాడు. రెండు రోజుల పాటు విహార యాత్రలో ఎంతో ఆనందంగా గడిపిన కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అతను కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
విహార యాత్ర ముగించుకుని వస్తుండగా..
పి.గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన నేలపూడి విజయకుమార్ కుటుంబం అరకులో రెండు రోజుల విహారయాత్ర ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఊడిమూడి శివారు చింతావారిపేట వద్ద మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు ప్రధాన పంట కాలువలోకి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య ఉమ (31), పెద్ద కుమారుడు రోహిత్ (9) మృతి చెందగా, చిన్న కుమారుడు మనోజ్ (5) గల్లంతయ్యాడు. గల్లంతైన బాలుడి కోసం కాలువలో గాలిస్తున్నారు.
ఉపాధి చూపిన కారే అదుపు తప్పి..
బీఎస్సీ బీఈడీ చదివిన విజయకుమార్ ఉద్యోగం లేక కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో డ్రైవింగ్ కూడా నేర్పుతున్నాడు. అతని భార్య ఉమకు కూడా కారు డ్రైవింగ్ వచ్చు. వీరికి 2014లో వివాహమైంది. వీరి పిల్లలు రోహిత్ పి.గన్నవరం కాన్వెంట్‌లో మూడో తరగతి, మనోజ్ యూకేజీ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి గత శుక్రవారం వనజంగి, అరకు ప్రాంతాలకు వెళ్లి ఎంతో ఆనందంగా గడిపారు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు విశాఖపట్నం నుంచి తిరిగి ఇంటికి బయల్దేరారు. ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈతకోట గ్రామం వచ్చేసరికి భర్తకు నిద్ర రావడంతో, తాను కారు నడుపుతానని భార్య చెప్పింది. దీంతో ఆమె కారు నడుపుతూ ఉండగా ముందు సీట్లో భర్త, వెనుక సీట్లో ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. వారు ప్రయాణిస్తున్న కారు చింతావారిపేట వచ్చే సరికి అదుపుతప్పి పంట కాలువలో పడి మునిగిపోయింది. నీట్లో మునిగిన పెద్ద కుమారుడు రోహిత్‌ను తండ్రి ఒడ్డుకు చేర్చాడు. చుట్టూ చీకటి కారణంగా కంగారులో రోహిత్ మళ్లీ కాలువలోకి జారి పడి మునిగిపోయాడు. చిన్న కుమారుడు మనోజ్‌ను రక్షించే ప్రయత్నంలో భార్య ఉమ నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది. ముగ్గురినీ కాపాడేందుకు భర్త ప్రయత్నించి విఫలమయ్యాడు. కాలువ నుంచి పైకి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఎస్సై బి.శివకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన కొద్ది దూరంలోనే తల్లి ఉమ, పెద్ద కుమారుడు రోహిత్ మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. గల్లంతైన చిన్న కుమారుడు మనోజ్ కోసం కాలువలో గాలిస్తున్నారు. మృతదేహాల వద్ద భర్తతో పాటు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
ఐదు నిమిషాలు అయితే ఇంటికి వెళ్లిపోయేవారు
మరో ఐదు నిమిషాలయితే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఆ కుటుంబం ఇంటికి చేరేది. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న కారు కాల్వలోకి దూసుకుపోయిందని బంధువులు వివరించారు. రెండు నిమిషాలు అయితే రోడ్డు వెంబడి ఉన్న పంట కాలువను కూడా దాటి వెళ్లిపోయేవారు.
పోతవరంలో విషాద ఛాయలు
కారు ప్రమాదంలో తల్లీ కుమారుడు మృతి చెందడం, మరొక కుమారుడు గల్లంతు కావడంతో పోతవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు భోరున విలపించారు. కోడలు ఉమ, మనుమలు రోహిత్, మనోజ్ కోసం ఇంటి వద్ద తాతయ్య, నానమ్మలు వీరవెంకట సత్యనారాయణ, లక్ష్మి రోదిస్తున్నారు. లేరా పెద్దోడా, లే ఉమా అంటూ మృతదేహాల వద్ద విజయకుమార్ విలపించిన తీరు హృదయ విదారకంగా ఉంది. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ ఆర్.భీమరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శివకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పంట కాలువ వైపున రెయిలింగ్స్ నిర్మించాలి
రాజవరం–పొదలాడ రోడ్డులో జి.పెదపూడి నుంచి సోంపల్లి వరకూ పంట కాలువ వైపున రెయిలింగ్స్ నిర్మించాలని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు. రెయిలింగ్స్ లేకపోవడం వల్ల వాహనాలు కాలువలో పడిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రెయిలింగ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment