ఎంతకీ దొరకని ఆచూకీ
బయటకు రావాలంటే భయమేస్తోంది
పెద్ద పులి తమ ప్రాంతంలో సంచరించడంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయమేస్తోంది. వ్యవసాయ పనులకు, అడవిలోకి వెళ్లలేక పోతున్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయం మమ్మల్ని వెంటాడుతోంది. ఇప్పటికై నా అధికారులు పులి జాడ గుర్తించి మాకు రక్షణ కల్పించాలి.
– చింతల సరస్వతి, బాపన్నధార
మైదాన ప్రాంతానికి రావాలన్నా భయమే
పులి సంచారంతో మా ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి రావాలంటే భయమేస్తోంది. మేము నిత్యావసర వస్తువుల కోసం తప్పనిసరిగా మైదాన ప్రాంతానికి రావాల్సి వుంది. మూడు రోజులుగా పులి భయంతో ఇళ్లకే పరిమితమయ్యాం. దీంతో నిత్యావసర వస్తువుల కొరత నెలకొంది. అధికారులు పులి జాడను గుర్తించి మాకు రక్షణ కల్పించాలి.
– ముర్ల వెంకటలక్షి, బాపన్నధార
ప్రత్తిపాడు రూరల్: కొద్దిరోజులుగా పెద్ద పులి బురదకోట గ్రామ పంచాయతీ పరిధిలో సంచరిస్తూ స్థానికుల్లో అలజడి రేకెత్తిస్తోంది. శనివారం బురదకోట గ్రామానికి చెందిన రైతు ముర్ల వెంకట్రావు గిత్త దూడపై పులి దాడి చేసింది. అధికారులు ఘటనా స్థలంలో లభించిన పాద ముద్రలను సేకరించారు. వీటి ఆధారంగా గిత్త దూడపై పులే దాడి చేసిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో తాము అనుమానించిందే నిజం అయిందని గిరిజనులు భయపడుతున్నారు.
ఎటు వెళ్లిందో..
బురదకోట గ్రామ పంచాయతీ పరిధిలోని బాపన్నధారలొద్దులో దూడపై పులి దాడి చేసి నాలుగు రోజులు అవుతున్నా ఎక్కడా పులి జాడ కనిపించలేదు. పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పులి జాడ ఎక్కడా లభించలేదు. బాపన్నధార దిగువన ఉన్న ధారపల్లిలో పులి కనిపించిందని అటవీశాఖ అఽధికారులకు సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో అధికారులు క్షుణంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పులి జాడ లభించలేదు. వాతంగి వైపు పులి పాదముద్రలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే దూడపై దాడి చేసిన స్థలానికి ఇరువైపులా పులి జాడ లభించకపోవడంతో పులి ఎటువెళ్లిందనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఘటనా స్థలానికి ఆనుకొని ఉన్న బాపన్నధార, కొండపల్లి, బురదకోట, కె.మిర్తివాడ గిరిజన గ్రామాలతో పాటు కొండ దిగువన ఉన్న ధారపల్లి, కిత్తుమూరిపేట, అటువైపు శంఖవరం మండలంలోని పెదమల్లాపురం, వేళంగి, అనుమర్తి, ఆవెల్తి, మరోపక్క తాడువాయి, దాపర్తి, సిద్దివారిపాలెం, శృంగధార గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో పులి భయం పట్టుకుంది. ఆ గ్రామాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే మినహా రాత్రివేళల్లో బయటకు రావద్దని, పశువులను, మేకలు, గొర్రెలను పొలాల్లో ఉంచవద్దని సూచిస్తున్నారు.
అడవిలో పులి.. అందరిలోనూ అలజడి
ముమ్మరంగా గాలిస్తున్న అటవీ అఽధికారులు
భయం గుప్పిట్లో మన్యం వాసులు
పశువులను మేపేందుకు వెళ్లలేకపోతున్నాం
పులి సంచారంతో పశువులను మేపేందుకు వెళ్లలేకపోతున్నాం. పులి భయంతో పశువులకు ఇంటి వద్ద మేత పెట్టే పరిస్థితి లేదు. దీంతో భయపడుతూనే పశువులను గ్రామ పరిసరాల్లో మేపుతున్నాం. దీనివల్ల పశువులకు పూర్తి స్థాయిలో మేత దొరకడంలేదు. పులి జాడ కనిపెట్టి మాకు రక్షణ కల్పించాలి.
– చింతల బాలరాజు, బాపన్నధార
Comments
Please login to add a commentAdd a comment