ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు
తుని రూరల్: తుని మండలం తేటగుంట శివారు పాత ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణామాచారి తెలిపారు. ఎస్సై అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తునిలో శుభకార్యానికి హాజరై తిరిగి తమ స్వగ్రామం ప్రత్తిపాడు వెళ్లేందుకు అత్తి సూరిబాబు, సింధూరపు అనిల్ మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. దుర్గాడ నుంచి వస్తున్న దుంగల లోడు ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో సూరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను 108 అంబులెన్సులో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఎన్‌డీపీ మద్యంతో వ్యక్తి అరెస్ట్
అమలాపురం టౌన్: కేంద్ర పాలిత ప్రాంతం యానాం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్‌డీపీ) మద్యం సీసాలను కోనసీమకు అక్రమంగా రవాణ చేసి అమ్ముతున్న సమాచారంపై ఈఎస్ టాస్క్‌ఫోర్స్ సీఐ లింగం చిరంజీవి ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సిబ్బంది రావులపాలెం తదితర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున విస్తృత తనిఖీలు చేశారు. రావులపాలేనికి చెందిన పున్నపు శరత్‌బాబు యానాం నుంచి అక్రమంగా తెచ్చిన 37 మద్యం సీసాలను అమ్ముతుండగా ఆకస్మిక దాడితో పట్టుకున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. అతడిని అరెస్ట్ చేయడంతో పాటు అతని వద్ద నుంచి 37 యానాం ఎన్‌డీపీ మద్యం సీసాలు, అక్రమ రవాణాకు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.
దొంగతనం కేసులో జైలు
గోపాలపురం: దొంగతనం కేసులో ఒక వ్యక్తికి నాలుగు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించినట్లు గోపాలపురం ఎస్సై కర్రి సతీష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గోపాలపురం మండలం గంగోలు పంచాయతీ పరిధిలోని రాంపాలెం గ్రామంలో 28–05–2024వ తేదీన ఒక ఇంటిలోకి చొరబడి బీరువా పగులకొట్టి అందులో రూ.10వేల నగదును దొంగిలించిన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఒంకబొత్తప్పగూడెంకు చెందిన పట్టెం కిషోర్‌పై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కొవ్వూరు కోర్టు న్యాయమూర్తి కె.నాగలక్ష్మి జైలు, రూ.500 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
విద్యార్థులకు గాయాలు
రౌతులపూడి: తుని ఎన్‌ఎన్ పట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురై బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తుని నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు రాత్రి ఏడున్నర సమయంలో ఎస్.అగ్రహారం బిళ్లవాక సమీపంలో రోడ్డుపై ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు అద్దాలు పగిలి పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. రౌతులపూడి ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment