ఆక్వా రైతుల దాష్టీకం
హైకోర్టు ఆదేశాలు అతిక్రమణ
ఉప్పలగుప్తం: హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి ఓ యువకుడిని ఆక్వా రైతులు తాళ్లతో నిర్బంధించి చితకబాదిన ఘటన ఉప్పలగుప్తం మండలంలోని సన్నవిల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం సన్నవిల్లి గ్రామంలో కొన్ని సంత్సరాలుగా అనధికార ఆక్వా చెరువుల సాగు కొనసాగుతోంది. ఈ సాగుతో గ్రామంలో ఉన్న కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు దొరకడం లేదు. బోరు నీరు ఉప్పునీరుగా మారుతోందని గ్రామానికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్‌తో పాటు కొంతమంది యువకులు 2018 సంవత్సరంలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా చెరువులతో గ్రామానికి నష్టం జరుగుతుందని ఆక్వా సాగును నిలిపివేయాలని హైకోర్టు 2023లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును అతిక్రమించి గ్రామంలో కొంతమంది రైతులు సోమవారం మళ్లీ సాగు మొదలు పెడుతుండగా గ్రామానికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ అనే మండల మత్స్యశాఖ అధికారి హేమానంద్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ అధికారి అక్కడ ఎటువంటి సాగు జరగటంలేదని వాదించి ఆధారాలు పంపమనటంతో ఆ యువకుడు ఆక్వా సాగు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసే క్రమంలో అదే గ్రామానికి చెందిన గనిశెట్టి వెంకట్రాజు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, చిక్కం గాంధీ ఆ యువకుడిని నిర్బంధించి చితకబాదటంతో యువకుడు వీర దుర్గా ప్రసాద్ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సీహెచ్ రాజేష్ మంగళవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment