రౌతులపూడి: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు సూచించారు. ఎ.మల్లవరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు మత్తు పదార్థాలను కలిగివుంటున్నారని వచ్చిన వార్త మేరకు మంగళవారం పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ విచారణలో గురుకుల జూనియర్ కళాశాలలో తనిఖీ చేపట్టారు. సిబ్బందిని, ఉపాధ్యాయులను, పారిశుధ్య కార్మికులను, వాచ్‌మన్‌లను ఆరా తీశారు. వసతి గదులను, కళాశాల ఆవరణను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి మత్తుపదార్ధాలు కనిపించలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. గురుకుల పాఠశాల ఆవరణలో ఎలాంటి చట్టవ్యతిరేకమైన పనులు చేపట్టినా ఉపేక్షించేది లేదన్నారు. ఎవరైనా కళాశాల ఆవరణలో అసాంఘిక కార్యక్రమాలు చేపడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం కళాశాల ఆవరణలో విద్యార్థులతో సమావేశమై అసాంఘిక కార్యక్రమాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. రౌతులపూడి ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, ఎంఈఓ గాడి కొండబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment