పింఛన్ల వెరిపీకేషన్
సాక్షి, రాజమహేంద్రవరం: సామాజిక భద్రత పింఛన్లపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. అభాగ్యుల నోటికాడ కూడును లాగేసేందుకు పావులు కదుపుతోంది. లబ్ధిదారుల సంఖ్య కుదించేందుకు కసరత్తు చేపడుతోంది. అనర్హుల గుర్తింపు పేరుతో ఉన్న పింఛన్ల ఏరివేతకు వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే సామాజిక భద్రత పింఛన్ల తనిఖీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఓ గ్రామ సచివాలయాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ సచివాలయం పరిధిలో అందుతున్న పింఛన్లపై వెరిఫికేషన్‌కు నాంది పలికింది. ఇప్పటికే జిల్లాలో ఈ ప్రక్రియ ముగిసింది. పింఛన్ల పరిశీలనకు నియమితులైన అధికారుల బృందాలు తనిఖీ పూర్తి చేశారు. పరిశీలనలో గుర్తించిన అంశాలు ప్రభుత్వానికి నివేదించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ పరిణామం పింఛనుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మంచి ప్రభుత్వమని చెప్పుకుంటూ ముంచే పనులు చేస్తోందని మండిపడుతున్నారు.
తాడిమళ్ల–1 సచివాలయం పరిశీలన
పింఛన్ల తొలగింపులో భాగంగా కూటమి ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో తాడిమళ్ల–1 గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసింది. తనిఖీలకు సంబంధించి సెర్ప్ సీఈఓ వీరపాండియన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి 50 పింఛన్లకు ఒక బృందం చొప్పున 12 బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలరింగ్ ఇచ్చుకునేందుకు సర్వే బృందంలో ఇతర మండలాలకు చెందిన ఒక గెజిటెడ్ అధికారిని, సచివాలయ ఉద్యోగిని నియమించారు. బృందాలు పింఛను పొందుతున్న లబ్ధిదారు వద్దకు వెళ్లి తనిఖీ చేపట్టారు. అందులో వెల్లడైన విషయాలను మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. సాయంత్రానికి పరిశీలన పూర్తి చేశారు. తాడిమళ్ల–1 సచివాలయంలో 472 వివిధ రకాల పింఛన్ల తనిఖీ పూర్తయింంది.
పరిశీలనలో 13 అంశాలు
సామాజిక భద్రత పింఛన్ల పరిశీలనలో 13 అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. వాటిపై బృందంలోని సభ్యులు వివరాలు సేకరించారు. ప్రభుత్వానికి నివేదించారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే తొలగింపు ప్రక్రియ చేపడతారు. ప్రధానంగా దివ్యాంగులు, వితంతు పింఛన్లపై ఫోకస్ పెట్టారు.
● పింఛనుదారు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు ఆపైన ఉందా?.
● లబ్ధిదారుడి కుటుంబానికి మూడెకరాల కంటే ఎక్కువ మాగాణి, పదెకరాల కంటే ఎక్కువ మెట్ట ఉందా? లేదా రెండూ కలిపి పదెకరాల కంటే ఎక్కువ భూమి ఉందా? అని ఆరా తీస్తున్నారు.
● కుటుంబంలో ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా?.(టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
● కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగి, పెన్షనర్ ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
● విద్యుత్ వినియోగం నెలకు 300
యూనిట్ల కంటే ఎక్కువగా ఉందా?
● కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను
చెల్లిస్తున్నారా?
● దివ్యాంగులకు సంబంధించి
వికలత్వం కలిగి ఉన్నారా?
● పింఛన్‌దారుడి (రీ అసెస్‌మెంటు), వైద్య పరీక్షకు సిఫారసు చేస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రత్యేకంగా ఉన్నాయి.
● వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించి పునర్వివాహం చేసుకున్నారా..? అనే ప్రశ్న ప్రత్యేకంగా ఉంది.
● ఆయా ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసిన అనంతరం పింఛను కొనసాగించేందుకు సిఫారసు చేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని తనిఖీ చేసే ఉద్యోగి యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పింఛను దారుని ఫొటో క్యాప్చర్ చేస్తున్నారు.
త్వరలో జిల్లా వ్యాప్తంగా...
తొలి దశలో పైలెట్ ప్రాజెక్టుగా సచివాలయాన్ని ఎంపిక చేసిన కూటమి సర్కారు త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తొలగింపు ప్రక్రియకు నాంది పలకనున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2,37,389 పింఛన్లు అందజేస్తున్నారు. రానున్న రోజుల్లో వేల సంఖ్యలో పింఛన్లు తగ్గించే కుట్రలు సాగుతున్నాయి. టీడీపీ నేతలు చెప్పిన వారిని తొలగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.
తాడిమళ్ల–1లో వెరిఫికేషన్
చేసిన పింఛన్లు : 472
వృద్ధాప్య : 237
వితంతు : 98
కల్లుగీత : 16
మత్స్యకారులు : 17
దివ్యాంగ : 69
డప్పు కళాకారులు : 1
ఒంటరి మహిళ : 19
అభయహస్తం : 4
కిడ్నీ : 2
ఇతర : 9
అభాగ్యుల సామాజిక భద్రత
పింఛన్ల తొలగింపునకు
కూటమి ప్రభుత్వం కుట్ర
అనర్హుల గుర్తింపు పేరుతో
వెరిఫికేషన్ ప్రక్రియ
సర్వేకు 12 మంది
అధికారులతో బృందం
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా
తాడిమళ్ల–1 సచివాలయం
పూర్తయిన తనిఖీ.. ప్రభుత్వానికి నివేదిక
సర్వేపై లబ్ధిదారుల్లో ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment