ఉద్యోగం ఊడింది.. లంచం డబ్బు తిరిగివ్వండి
కాకినాడ క్రైం: ‘మీకు పర్మినెంట్ ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి మా దగ్గర లంచాలు తీసుకున్నారు. ఇప్పుడేమో ఆ ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డాం. మా దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వండి.’ అని ఎంపీహెచ్‌ఏ (మల్టీ పర్సస్ హెల్త్ అసిస్టెంట్)ల అడుగుతున్నారు. కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయం ఈ వివాదానికి కేంద్ర బిందువైంది.
అసలేం జరిగిందంటే... 2002లో రాష్ట్ర ప్రభుత్వం ఎంపీహెచ్‌ఏ మేల్ అభ్యర్థుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 217 పోస్టుల భర్తీకి సన్నాహాలు చేశారు. పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగ నియామకాలు జరిగాయి. రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే పదవ తరగతి పూర్తి చేశామని దరఖాస్తు చేసుకున్న కొందరు ప్రైవేటు పాఠశాలల్లో చదువు పూర్తి చేయగా వారి సర్టిఫికెట్ల వాస్తవికతపై అనుమానాలు వ్యక్తమై అనుమతించలేదు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. నిర్ణీత 217 పోస్టులకు అదనంగా సుమారు 125 మంది తమ అర్హతను ప్రస్తావిస్తూ 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ పార్కు వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల ముందు వివాదాలకు చెక్ పెట్టాలనుకున్న అప్పటి ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరుతో ఓ కమిటీ వేసింది. వారి సిఫారసుతో మెరిట్, రోస్టర్‌ల అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చేయాలని తీర్మానించింది. దీంతో అప్పటి ప్రభుత్వం 1207 జీవో ద్వారా, నిరసనకు దిగిన 125 మందికి నియామక నిబంధనలు తుంగలో తొక్కి రాజకీయ ప్రయోజనం కోసం ఉద్యోగాలు ఇచ్చేసింది. దీంతో జిల్లాలో ఎంపీహెచ్‌ఏ మేల్ సంఖ్య 217కి బదులు 342కి చేరింది. మెరిట్, రోస్టర్‌కు తావు లేకుండా కేవలం నిరసనతో ఉద్యోగాలు పొందిన వీరి వ్యవహారంపై మెరిట్ ఉన్న కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అలా వ్యక్తిగతంగా ఆశ్రయిస్తూ కోర్టు ఆర్డర్లు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. ఇలా కోర్టును ఆశ్రయించిన వారి సంఖ్య సుమారు 150 మంది కాగా, వారందరూ ఉద్యోగాలు పొందారు. ఈ నియామకాలతో కలిపి ఎంపీహెచ్‌ఏల సంఖ్య 492కి చేరింది. అయితే అప్పటి కేసుపై హైకోర్టు కొద్ది రోజుల క్రితం తుది తీర్పు వెలువరించింది. 2002లో నోటిఫికేషన్‌లో ప్రకటించిన 217 పోస్టులు మాత్రమే ఫైనల్ అని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోర్టు తీర్పును అనుసరించి కింది కోర్టుల ఉత్తర్వులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసుతో వచ్చిన వారిని తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో వీరంతా ఉద్యోగాలు కోల్పోయారు. అయితే వీరు నిరసనలు, పోరాటాల దశలో ఉన్నప్పుడు వారి అవసరాన్ని అడ్డుగా పెట్టుకొని కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారులు డబ్బు దండుకున్నారు. అప్పటి ఇన్‌చార్జి ఏవో పాత్ర కీలకమని బాధితులు అంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని, ఇప్పుడు ఉద్యోగం పోయి రోడ్డున పడ్డామనీ ఆ మొత్తాన్ని తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు డీఎంహెచ్‌వోను కలిసి వేడుకున్నారు.
కొలువులు కోల్పోయిన అభ్యర్థుల గగ్గోలు
తమను మఽభ్యపెట్టిన డీఎంహెచ్‌వో
కార్యాలయ అధికారిపై గుర్రు
Comments
Please login to add a commentAdd a comment