రైల్వేగేటు మూసివేత
నిడదవోలు : తాడేపల్లిగూడెం – నిడదవోలు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో నెహ్రూ బొమ్మ సెంటర్‌లో రైల్వే పట్టాల మరమ్మతుల కోసం బుధవారం రాత్రి 10 గంటలకు రైల్వేగేటును అధికారులు మూసివేశారు. మరమ్మతులు పూర్తి చేసి గురువారం రాత్రి 10 గంటలకు గేటును తిరిగి తెరుస్తామని ప్రకటించారు.
సౌదీ అరేబియాలో
ఉద్యోగావకాశాలు
అమలాపురం రూరల్: బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు సౌదీ అరేబియా దేశంలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు బుధవారం ఇక్కడ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఓంక్యాప్, అల్ యూసుఫ్ ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తాధ్వర్యంలో ఈ నియామకాలు చేస్తున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దీనికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలన్నారు. ఏదైనా ఆస్పత్రిలో ఏడాదిన్నర పాటు పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. వీసా, విమాన టికెట్లతో కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.37,500 చెల్లించాలన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.78 వేల నుంచి రూ.89 వేల వరకూ జీతం వస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం rkilinternationa@aprrdc.in మెయిల్ ఐడీకి రెజ్యూమ్ పంపించాలని తెలిపారు. వివరాలకు 99888 53335, 95814 22339 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చని హరిశేషు తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలపై
కూటమి నేతల పెత్తనం వద్దు
మంత్రి సుభాష్ కార్యాలయం ప్రకటన
రామచంద్రపురం: కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) నాయకులు రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలపై ఎటువంటి పెత్తనం చేయవద్దని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన వెలువడింది. మంత్రికి, మంత్రి కార్యాలయానికి తెలియకుండా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కూటమి నాయకులు ఎటువంటి ఆదేశాలు జారీ చేయరాదని పేర్కొంది. అదే విధంగా నియోజకవర్గంలోని పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రి దృష్టికి తేకుండా ఎటువంటి ఆకస్మిక తనిఖీలు చేయకూడదని తెలిపింది.
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి మార్గశిర శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఇతర ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధుమిత్రులతో కలిసి సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత మంటపాలు, క్యూ లు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. బుధవారం సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవికి బుధవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment