కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో బుధవారం సంస్థ కార్యాలయంలో హైదరాబాద్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎమినెంట్ గ్యాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నామని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్‌ఐ) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్ తెలిపారు. వర్జీనియా పొగాకు క్యూరింగ్ విధానానికి కలపకు బదులుగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ)ను వాడుకునేందుకు సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం, విశ్లేషణ, రైతులకు అందించడానికి మొట్ట మొదటిసారి ఒక అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఆ దిశగా పరిశోధనలు వేగవంతం చేసేందుకు, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఒక ప్రాజెక్టును పెద్ద మొత్తంలో ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాబోయే సంవత్సరాలలో మన తెలుగు రాష్ట్రాలలో 40,000 పైచిలుకు ఉన్న పొగాకు బ్యారన్‌లలో కలప వినియోగం గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. దానివల్ల రైతులకు కలప సంబంధిత సమస్యలతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు. పర్యావరణానికి శూన్య ఉద్గారాల దిశగా పొగాకు పంట ఉంటుందని వివరించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జనరల్ మేనేజర్ యోగ రాణి సురేష్, చీఫ్ మేనేజర్ పీవీ లలిత, మేనేజర్ డి.భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్, వి.గోపాల్, ఎమినెంట్ గ్యాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డైరెక్టర్ ఎం.ఎస్.కిషోర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎస్. ప్రసాద్ పాల్గొన్నారు. సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు, నిపుణులు డాక్టర్ ఎల్.కె. ప్రసాద్, డాక్టర్ సి.చంద్రశేఖరరావు, డాక్టర్ హెచ్.రవిశంకర్, కె.విశ్వనాథరెడ్డి, డాక్టర్ బి.హేమ, పొగాకు అభ్యుదయ రైతు వాసు పాల్గొన్నారు.
ఐఓసీఎల్‌తో ఉమ్మడి ప్రణాళిక
సీటీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్
Comments
Please login to add a commentAdd a comment