సంక్షోభంలో సమతూకమా!
● సమీకరణాలతో డీసీ చైర్మన్ల నియామకం
● అనుభవాన్ని పట్టించుకోని కూటమి ప్రభుత్వం
● తూర్పు డెల్టా జనసేనకు.. మధ్య డెల్టా టీడీపీకి..
● సాగునీటి యాజమాన్యంపై అన్నదాతల పెదవి విరుపు
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా సంక్షోభంలో ఉంది. మూడు పంటలు పండే ఈ ప్రాంతంలో ఖరీఫ్, రబీ వరిసాగు చేయలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పంట కాలువలు అధ్వానంగా.. మురుగునీటి కాలువలు పూడుకుపోయి నీటి యాజమాన్యం అస్తవ్యస్తంగా తయారైంది. సిబ్బంది అనుభవ లేమి, నిర్లక్ష్యం వల్ల డెల్టా వ్యవస్థ ఇలా తయారైంది. కనీసం పూడిక తొలగింపునకు సైతం ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వని దుస్థితి. ఈ సమయంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్లను అనుభవం ఉన్నవారిని.. సమర్థులను ఎంపిక చేసి ఉంటే సరిపోయేది. రాజకీయ పార్టీ.. కులాలు.. ప్రాంతాల ప్రాతిపదికన కొత్తవారిని ఎంపిక చేయడం, వారికి డెల్టా వ్యవస్థపై పెద్దగా అనుభవం లేకపోవడం రైతులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.
గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు సాఫీగా సాగిపోయాయి. టీడీపీ అధిష్టానం.. టీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించిన చైర్మన్, వైస్ చైర్మన్లను డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌లు (డీసీలు) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవుల పంపిణీలో అసంతృప్తులు తలెత్తకుండా గోదావరి డెల్టాను తూర్పు, మధ్య డెల్టాలుగా వీడదీసి చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నుకున్నారు. ఒక ప్రాజెక్టు కమిటీ పరిధిలో ఇద్దరు చైర్మన్‌ల అవసరం ఏమిటో? వారి విధి విధానాలు, బాధ్యతలు ఏమిటో ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీకి అమలాపురం, తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ కాకినాడ కలెక్టరేట్‌లలో శనివారం ఎన్నికలు నిర్వహించారు.
గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా పి.గన్నవరం డీసీ గుబ్బల శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. ఆయన నీటి సంఘాలకు పూర్తిగా కొత్త. తొలుత ఈ పదవికి కాట్రేనికోన డీసీ ఆకాశం శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో డీసీగా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో పాటు సామాజిక సమీకరణలలో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. శుక్రవారం రాత్రి వరకు శ్రీనివాస్ పేరు వినిపించగా, రాజోలు, పి.గన్నవరం జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దేవ వర ప్రసాద్, గిడ్డి సత్యనారాయణ పట్టుబట్టి పి.గన్నవరం డీసీ గబ్బుల శ్రీనివాస్‌ను ఎంపిక చేయించారు. సొంత పార్టీకి చెందిన రాజోలు నుంచి పినిశెట్టి బుజ్జి ఉన్నప్పటికీ సామాజిక సమీకరణల పేరుతో అతని పేరును పక్కనబెట్టారు. ఆకాశం శ్రీనివాస్‌కు వైస్ చైర్మన్ పదవికి ఎంపిక చేసి పంపించారు. అయితే అమరావతి నుంచి వచ్చిన జాబితాలో శ్రీనివాస్ స్థానంలో కరుటూరి నర్శింహరావు పేరు రావడం గమనార్హం. ఈయన సైతం నీటి సంఘాలకు కొత్త. లోకేష్ ద్వారా చెప్పించుకుని తెరపైకి రావడంతో శ్రీనివాస్‌కు మొండి చేయి దక్కింది.
గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)– డీసీ మారాలశెట్టి సునీల్ కుమార్ (జనసేన) ఎంపిక కాగా, వైస్ చైర్మన్‌గా అనపర్తి డీపీ తమలంపూడి సుధాకర్ రెడ్డి (టీడీపీ) ఎన్నికయ్యారు. వీరిద్దరూ నీటి సంఘాలకు కొత్త కావడం విశేషం. ఈ ప్రాంతంలో కొమరిపాలెం, కోటిపల్లి, కూళ్ల డీసీలుగా ఎంపికై న కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, దాట్ల వెంకట రాజ గోపాలరాజు, మేకా శివ ప్రసాద్ గతంలో నీటి సంఘాలలో పనిచేసిన అనుభవం ఉంది. కొత్తగా ఎన్నికై నవారికి ఆ అనుభవం కూడా లేకపోవడం గమనార్హం.
దాట్ల మాటకు దక్కని ప్రాధాన్యం
తన పరిధిలో మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవి వచ్చేలా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆకాశం శ్రీనివాస్‌కు చైర్మన్, వైస్ చైర్మన్ పదవి రాకపోవడంతో పాటు తన నియోజకవర్గం పరిధిలో తాళ్లరేవు డీసీ వేగేశ్న భాస్కరరాజుకు తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మప్ పదవికి పట్టుబట్టినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment