కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో శాంక్షన్డ్ పోస్టుల్లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారం వందల కుటుంబాల్ని పస్తులుండేలా చేస్తోంది. లేని పోస్టుల్ని సృష్టించి మరీ అమ్మేసిన ఘనకార్యంలో బాధ్యుడైన, నర్సింగ్ పోస్టుల అమ్మకాల్లో ఇప్పటికే సస్పెండైన ఆసుపత్రి మేనేజర్‌పై తదుపరి చర్యలకు అధికారులు పూనుకుంటుండగా, ఈ అవినీతి మాటున అమాయక ఉద్యోగులు బలైపోయారు. 2021 ఏడాది శాంక్షన్డ్ పోస్టుల భర్తీ కేంద్రంగా జరిగిన ఈ అవినీతిలో 12 పోస్టులు లంచాలు పుచ్చుకొని అమ్మేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇదే రిక్రూట్‌మెంట్‌లో నియమితులై పనిచేస్తున్న 190 మందిలో ఈ 12 మంది ఉన్నారన్న కారణంతో ఏకబికిన 190 మంది జీతాలూ నిలిపేశారు. ఇందులో 30 మంది కాంట్రాక్టు బేసిక్, 160 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. గత నెల జీతాలు ఈ నెల 1వ తేదీ నాటికే జమ కావాల్సి ఉంది. రెండో నెల పూర్తి కావొస్తున్నా నేటికీ జమ కాలేదు. ఉద్యోగుల జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఇప్పటికే ఏపీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ బృందం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం కలెక్టర్‌ను కలసి జీతాలు విడుదల చేయాలని విన్నవించాలని నిర్ణయించారు. అయితే ఖజానా శాఖ అవరోహణ క్రమంలో ఉద్యోగుల జాబితా తయారు చేసి అనర్హులను వేరు చేసి ఇస్తే మిగిలిన వారికి జీతాల బిల్ పెడతామని తద్వారా జీతాల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పినా ఆసుపత్రి అధికారుల్లో మాత్రం స్పందన లేదు. నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ మాత్రం జాబితాను తయారు చేయలేకపోయారు. ఈ విషయంపై కలెక్టర్ షణ్మోహన్‌ను వివరణ కోరగా తన వద్దకు నేటికీ జీతాల విడుదలకు సంబంధించి ఎటువంటి నోట్ ఫైల్ జీజీహెచ్ నుంచి రాలేదన్నారు.
మేనేజర్ అవినీతి, అధికారుల నిర్లక్ష్యం
పండగ వేళ జీజీహెచ్ ఉద్యోగులకు పస్తులు
Comments
Please login to add a commentAdd a comment