వెళ్దాం లే.. సునీతా!
ప్రత్తిపాడు: లే సునీత.. వెళ్దాం.. నీవు లేకపోతే నేనుండలేను అంటూ భార్య మృతదేహం వద్ద ఆ భర్త ఆక్రందన అందరినీ కలచివేసింది.. ఈ హృదయ విదారక ఘటన ప్రత్తిపాడు జాతీయ రహదారిపై నరేంద్రగిరి వద్ద జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం ఆనందనగర్‌కు చెందిన వరిగొండ రవికుమార్ పౌరోహిత్యం చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆయన తన భార్య సునీత (45)తో కలసి స్కూటీపై ప్రత్తిపాడు వస్తున్నారు. వీరి వాహనాన్ని స్థానిక జాతీయ రహదారిపై నరేంద్రగిరి వద్ద లంపకలోవ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో సునీత తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రవికుమార్ ఏం జరిగిందో తెలియక కొంత సేపు అయోమయానికి గురయ్యాడు. అంతటి గాయాలైనా రోడ్డుపై పడిఉన్న భార్య చెంతకు వెళ్లి లే సునీత..వెళ్దాం అని మాట్లాడడం అక్కడి వారిని కలచివేసింది. తీవ్ర గాయాల పాలైన రవికుమార్‌ను చికిత్స నిమిత్తం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. సునీత మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్య మృతదేహం వద్ద భర్త కన్నీరు
భార్యాభర్తల బంధాన్ని
విడదీసిన రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment