నష్టపోయినారు
పెట్టుబడులు కూడా రాలేదు
నేను 60 సెంట్ల విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.40 వేలు, పెట్టుబడి రూ.1.50 లక్షలు అయ్యింది. రెండేళ్లుగా నారు రేటు ఆశాజనకంగా లేదు. పొగాకు సాగుకు మించి నారుమడులు ఉండటంతో డిమాండ్ తగ్గింది. చాలా మంది రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు.
– గెల్లా గోవిందరాజు,
సుబ్బరాయపురం, కౌలు రైతు, దేవరపల్లి
కోలుకోలేని దెబ్బ
ఎకరం విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.80 వేలు, పెట్టుబడి రూ.2.30 లక్షలు అయ్యింది. ఎకరం నారు ధర రూ.1,500 పలికింది. అది కూడా అడిగిన నాథుడే లేడు. ఈ ఏడాదికి నారు సీజన్ ముగిసింది. ఎకరాకు రూ.2 లక్షల నష్టం వస్తోంది. నారు రైతులు నిండా మునిగారు.
– సీహెచ్ వెంకటేశు, కౌలు రైతు,
రామన్నపాలెం, దేవరపల్లి మండలం
దేవరపల్లి: ధరలు పడిపోవడం, ఇతర ప్రాంతాల్లో రైతులు సొంతంగా నారు పెంచడంతో.. పొగాకు నారు వేసిన రైతులు, కౌలుదార్లు ఈ సీజన్‌లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 23 వేల హెక్టార్లలో పొగాకు సాగుకు టుబాకో బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే, గత ఏడాది పొగాకుకు రికార్డు స్థాయి ధర రావడంతో ఈసారి రైతులు బోర్డు అనుమతించిన దానికి మించి, ఇప్పటికే సుమారు 25 వేల హెక్టార్లలో పొగాకు నాట్లు వేశారు. ఇప్పటికే చాలా వరకూ నాట్లు దాదాపు పూర్తి కావడంతో పొగాకు నారు సీజన్ ముగిసింది.
గత ఏడాది కాసుల పంట
గత ఏడాది పొగాకు నారుకు చివరి దశలో ఊహించని డిమాండ్ ఏర్పడి, రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. నాట్ల ప్రారంభంలో ఎకరం నారు (6 వేల మొక్కలు) ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ పలికింది. ఇది గిట్టుబాటు కాక కొంత మంది రైతులు నష్టపోయారు. అనంతరం గత ఏడాది డిసెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను నారు రైతుల పాలిట వరంగా మారింది. వేసిన పొగాకు నాట్లు ఈ తుపాను ప్రభావంతో దెబ్బ తిన్నాయి. తుపాను అనంతరం రైతులు మళ్లీ నాట్లు వేయడంతో నారుకు ఎక్కడ లేని డిమాండూ ఏర్పడింది. దీంతో నారుమడులు కట్టిన కౌలు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను అనంతరం ఎకరం నారు ధర ఏకంగా రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలికింది. ఈ ధర పొగాకు నారు చరిత్రలో రికార్డుగా నిలిచింది. ఎకరం విస్తీర్ణంలో నారు మడులు కట్టిన రైతుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం వచ్చింది. అప్పటి వరకూ గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెట్టిన కౌలు దారులకు కాసుల పంట పండింది.
ఆశ పడితే మొదటికే మోసం
గత ఏడాది ధరలు చూసిన కౌలుదార్లు, రైతులు ఈసారి కూడా పొగాకు నారుకు మంచి ధరలు పలుకుతాయని ఆశ పడ్డారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో అధిక ధరలకు భూములను కౌలుకు తీసుకున్నారు. గత ఏడాది ఎకరం కౌలు రూ.40 వేలు కాగా, ఈ ఏడాది అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ పలికింది. అయినా సరే తగ్గేదేలే.. అన్నట్లు కౌలుదార్లు పోటీ పడి మరీ భూములను కౌలుకు తీసుకుని నారుమడులు కట్టారు. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఉత్తర తేలికపాటి నేలల (ఎన్‌ఎల్‌ఎస్) ప్రాంతంలోని నాలుగు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో నారుమడులు కట్టినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే, వాతావరణం అనుకూలించడంతో తక్కువ సమయంలోనే రైతులు పొగాకు నాట్లు పూర్తి చేశారు. నాట్ల ప్రారంభంలో నారు ధర రూ.2 వేల నుంచి రూ.2,500 పలకగా, నవంబరులో అది రూ.1,500కు పడిపోయింది. అయినప్పటికీ నారు అడిగే నాథుడు లేక చాలా మంది రైతులు బోణీ కూడా చేయలేదు. ఎకరాకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవడంతో పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో కౌలుదార్లు, రైతులు మొదటికే మోసపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నారుమడులు కట్టిన రైతుల్లో 80 శాతం కౌలుదార్లే ఉన్నారు. వీరు భూములను కౌలుకు తీసుకుని, ఏటా నారుమడులు కట్టి, నారు విక్రయాలు జరుపుతారు. సాధారణంగా వీరి వద్ద నుంచి ఈ ప్రాంతంతో పాటు తెలంగాణలోని జీలుగుమిల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లాలోని పొదిలి, కనిగిరి ప్రాంతాల రైతులు నారు కొనుగోలు చేస్తూంటారు. ఈ ఏడాది అక్కడ కూడా రైతులు సొంతంగా మడులు కట్టి, నారు పెంచడంతో ఇక్కడి నారుకు డిమాండ్ తగ్గింది. దాదాపు 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పొగాకు నారు వ్యాపారం జరుగుతోంది. గత ఏడాది నారు ధర చూసి బెంబేలెత్తిన పొగాకు రైతులు ఈ ఏడాది ముందుగానే జాగ్రత్త పడ్డారు. తమ అవసరాలకు సరిపడా సొంతంగా మడులు కట్టి నారు పెంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నారు రైతులు ఈ సీజన్‌లో నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది.
ఫ ముగిసిన పొగాకు నారు సీజన్
ఫ డిమాండ్ లేక నష్టపోయిన రైతులు
ఫ ఎకరాకు రూ.5 లక్షల వరకూ పెట్టుబడి
రూ.4 లక్షల నష్టం
ఒకటిన్నర ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పొగాకు నారుమడులు కట్టాను. ఎకరం కౌలు రూ.70 వేలు, పెట్టుబడి రూ.4 లక్షలు, పట్టుబడి కలిపి మొత్తం సుమారు రూ.6 లక్షల పెట్టుబడి అయ్యింది. నారుకు ధర లేక కనీసం పెట్టుబడి కూడా రాలేదు. సుమారు రూ.4 లక్షల నష్టం వచ్చింది. ఎక్కువ విస్తీర్ణంలో నారుమడులు కట్టడం, రైతులు కూడా సొంతంగా అవసరం కంటే ఎక్కువగా నారుమడులు కట్టడంతో నారుకు డిమాండ్ తగ్గింది.
– కడిమి శ్రీనివాస్, కౌలు రైతు, దేవరపల్లి
Comments
Please login to add a commentAdd a comment