న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేక నిఘా
కొవ్వూరు: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఈ నెల 31వ తేదీ రాత్రి మద్యం తాగి, రోడ్ల పైకి వచ్చి, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కొవ్వూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీ రాత్రి మద్యం దుకాణాలను నిర్దిష్ట వేళలకే మూసివేయాలని స్పష్టం చేశారు. మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లు తొలగించి, రోడ్ల పైకి వచ్చి అల్లర్లు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లర్లకు ఆస్కారం లేకుండా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్స్ ఉన్న వారందరినీ ముందస్తుగా బైండోవర్ చేసుకుంటామన్నారు. న్యూ ఇయర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గ్రూపు పార్టీలు, అశ్లీల నృత్యాల ప్రదర్శనల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. సంక్రాంతి పండగ సమీపిస్తున్నందున కోడిపందేల నిర్వాహకులను, కత్తులు కట్టే వారిని బైండోవర్ చేస్తామని ఎస్పీ చెప్పారు. 112 నంబర్‌కు ఫోన్ చేస్తే 8 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసు సేవలు అందిస్తామని అన్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు సరాసరి 90 కాల్స్ వస్తున్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 1,500 సీసీ కెమెరాలున్నాయని, మార్చి నెలాఖరుకు మరో 500 ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైవేలపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొవ్వూరు – గుండుగొలను మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై 37 బ్లాక్ స్పాట్లు గుర్తించామన్నారు. జిల్లాలో ఈ ఏడాది క్రైమ్ రేటు అదుపులో ఉందని, అక్టోబర్ నాటికి గతంలో కంటే 10 శాతం తగ్గిందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నియంత్రించేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో రూరల్, టౌన్ సీఐలు కె.విజయబాబు, పి.విశ్వం, రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ రోడ్లపై న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవు
ఫ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్
Comments
Please login to add a commentAdd a comment