పూలసాగులో మెళకువలతో అధిక దిగుబడి
కడియం: పూలసాగులో రైతులు మెళకువలు పాటిస్తే అధిక దిగుబడితో పాటు, నాణ్యమైన పువ్వులు పొందుతారని డివిజనల్ ఫ్లోరీకల్చర్ రీసెర్చి సెంటర్ (డీఎఫ్‌ఆర్‌సీ) ప్రధాన శాస్త్రవేత్త డీవీఎస్ రాజు అన్నారు. వేమగిరిలోని రీసెర్చి సెంటర్‌ను ఒడిశా రాష్ట్రం గంజాం ప్రాంతానికి చెందిన రైతులు గురువారం సందర్శించారు. పూలసాగు ప్రాధాన్యం, తెగుళ్లు, చీడపీడలను ఎదుర్కొనే యాజమాన్య పద్ధతుల గురించి వారికి శాస్త్రవేత్తలు డీవీఎస్ రాజు, మాధవన్ వివరించారు. నాణ్యమైన ఉత్పత్తులు పొందడానికి అనుసరించాల్సిన సాగు విధానాలను తెలిపారు. అనంతరం కడియపులంకలోని నర్సరీలను రైతులు సందర్శించారు. అక్కడ వివిధ రకాల మొక్కల పెంపకం, ఆధునిక విధానాలను పరిశీలించారు. ఆయా నర్సరీ రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కడియం మండల ఉద్యాన శాఖాధికారి డి.సుధీర్‌కుమార్, ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.
ఏపీ ప్రత్యేక రక్షణ దళం
ప్రాంతీయ కార్యాలయం మార్పు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయాన్ని స్థానిక నారాయణపురంలోని నాగమ్మతల్లి గుడి వెనుక వైపునకు మార్చారు. దీనిని కమాండెంట్ కొండా నరసింహారావు, సహాయ కమాండెంట్ పీవీఎస్‌ఏడీ ప్రసాదరావు, డి.గంగరాజు, అధికారులు, సిబ్బంది గురువారం ప్రారంభించారు. కమాండెంట్ నరసింహరావు దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, సర్వమత ప్రార్థనలు చేశారు.
నేడు ఏలూరుకు
ఏకసభ్య కమిషన్ రాక
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ ఉప వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ శుక్రవారం ఏలూరు జిల్లాలో పర్యటించనుంది. జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి ఎంఎస్ శోభారాణి గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా యంత్రాంగం, వివిధ ఉప కులాల సభ్యులు, సంఘాలతో సమావేశమై వినతులు స్వీకరిస్తారని వివరించారు.
రేపు ఐఐహెచ్‌ఆర్
ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాక
కొవ్వూరు: అఖిల భారత పండ్ల పరిశోధన సమన్వయ పథకం (ఐఐహెచ్‌ఆర్) బెంగళూరు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్ పటేష్ స్థానిక వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానాన్ని శనివారం సాయంత్రం 3 గంటలకు సందర్శించనున్నారు. పరిశోధన స్థానం ముఖ్య శాస్త్రవేత్త పి.లలితా కామేశ్వరి గురువారం ఈ విషయం తెలిపారు.
వైద్యాధికారులకు పదోన్నతులు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఎన్.రాజకుమారి, రాజమహేంద్రవరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీహరిబాబులకు గురువారం పదోన్నతి లభించింది. రాజకుమారిని కాకినాడ జనరల్ ఆసుపత్రి సివిల్ సర్జన్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్‌గాను, శ్రీహరిబాబును శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ స్పెషాలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు సివిల్ సర్జన్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్‌గాను నియమించారు. వారిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment