నాడు కాదని.. నేడు ఔనని..
● భూముల రీసర్వేపై గతంలో
కూటమి దుష్ప్రచారం
● నేడు మళ్లీ అదే ప్రక్రియ చేపట్టిన సర్కార్
● మండలానికో గ్రామంలో
పైలట్ ప్రాజెక్టుగా నిర్వహణ
● 72 గ్రామాల్లో నిర్వహించాలని లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: భూ వివాదాలకు తెర దించేందుకు, భూములను పూర్తి హక్కులతో యజమానులకు అప్పజెప్పేందుకు, తద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టిన విషయం తెలిసిందే. దీని కోసం ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసుకువచ్చింది. నాటి ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన ఈ ప్రక్రియపై గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు అండ్ కో ఎక్కడ లేని దుష్ప్రచారం చేసింది. ఏకంగా భూములు లాగేసుకుంటారంటూ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో తప్పుడు ప్రచారానికి ఒడిగట్టి, ప్రజలు, రైతుల మస్తిష్కాల్లో విషబీజాలు నాటారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేసి, రీసర్వే నిలిపివేశారు.
సీన్ కట్ చేస్తే..
నాడు కాదు కాదన్న భూముల రీసర్వేను అదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు తిరిగి ప్రారంభించింది. గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం నల్లజర్ల మండలం వీరవల్లిలో రీసర్వేకు శ్రీకారం చుట్టింది. అలాగే, మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని రీసర్వేను మళ్లీ ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. వీఆర్‌ఓ ఆధ్వర్యాన గ్రామంలోని సర్వే నంబర్లలో హక్కుదారులెవరున్నారు? వారి భూములకు పట్టాదారు పాసు పుస్తకాలున్నాయా వంటి అంశాలు పరిశీలిస్తున్నారు. లేని వారికి మ్యూటేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. యజమాని చనిపోతే వారసులు తమ పేరిట భూ హక్కులు మార్చుకోవడానికి వీఆర్‌ఓకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ విడత మొత్తం 72 గ్రామాల్లో రీసర్వే నిర్వహించనున్నారు. సర్వే సమయంలో అందించిన నోటీసు ప్రకారం ఆయా వ్యక్తులు, చనిపోయిన వారి వారసులు అవసరమైన డాక్యుమెంట్లతో హాజరు కావాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వ హయాంలోనే..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా వివిధ దశల్లో 272 గ్రామాల్లో భూముల రీసర్వే చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడతగా 45 గ్రామాల్లో 64,438.92 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో దశలో 55 గ్రామాల్లో 90,517.58 ఎకరాల్లో సర్వే చేశారు. మూడో దశలో భాగంగా 90 గ్రామాల పరిధిలోని 1,80,312.03 ఎకరాల్లో రీసర్వే దాదాపు పూర్తి చేశారు. ప్రభుత్వ భూములు, చిన్న చిన్న కమతాలు, భూస్వాముల భూములు, నివాస గృహాలు, వీధులు, ప్రైవేటు భూములు, పరిశ్రమలు ఇలా గ్రామానికి చెందిన మొత్తం విస్తీర్ణాన్ని సర్వే చేశారు. తొలుత గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ పూర్తి చేశారు. సర్వే నిర్వహిస్తున్న గ్రామానికి పొరుగున ఉన్న వీఆర్‌ఓలు, గ్రామ సర్వేయర్ల సేవలు వినియోగించుకున్నారు. ప్రతి గట్టూ తిరిగి సరిహద్దులు నిర్ధారించారు. రీసర్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్ వర్క్ సాయంతో ప్రక్రియ సాగింది. డ్రో న్లను రంగంలోకి దింపి సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. మూడు విడతల్లో సర్వే పూర్తయిన 190 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీజోన్ యాక్టివిటీస్ కింద భూముల హద్దులకు సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్ చేపట్టారు. సర్వే పూర్తయిన విస్తీర్ణానికి రెండు దశల్లో 15,113 సరిహద్దు రాళ్లు సైతం పాతారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు సైతం పంపిణీ చేశారు. ఎలాంటి వ్యయ ప్రయాసలూ లేకుండా వివాదాలు కొలిక్కి రావడంతో అప్పట్లో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నాడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై అభూతకల్పనలతో దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు.. నేడు రీసర్వే ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పారదర్శకంగా నిర్వహిస్తాం
భూముల రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేపట్టాం. సర్వే సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించాం. జిల్లాలోని 72 గ్రామాల్లో సర్వేకు ప్రణాళికలు రూపొందించాం. పైలట్ ప్రాజెక్టుగా 19 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తాం. రైతులు సర్వేలో పాల్గొని తమ భూ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
– ఎస్.చిన్నరాముడు, జిల్లా జాయింట్ కలెక్టర్
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మూడు విడతల్లో జరిగిన సర్వే వివరాలు
రెవెన్యూ డివిజన్ గ్రామాలు సర్వే పూర్తయిన
విస్తీర్ణం(ఎకరాలు)
మొదటి విడత
కొవ్వూరు 11 8,256.31
రాజమహేంద్రవరం 34 56,182.61
రెండో విడత
కొవ్వూరు 30 27,719.86
రాజమహేంద్రవరం 25 62,797.72
మూడో విడత
కొవ్వూరు, రాజమహేంద్రవరం 90 1,80,312.03
Comments
Please login to add a commentAdd a comment