మహాలక్ష్మిది హత్యే..
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలం తోటపేటలోని తోట త్రిమూర్తులు కాలనీలో అనుమానాస్పదంగా మృతి చెందిన దామిశెట్టి మహాలక్ష్మి (54)ని బంగారం కోసం ఓ వ్యక్తి హత్య చేసినట్లు రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ సోమవారం వెల్లడించారు. తోట త్రిమూర్తులు కాలనీకి చెందిన దామిశెట్టి మహాలక్ష్మి తన ఇంట్లో ఈ నెల 12న మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ద్రాక్షారామ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. అనంతరం మహాలక్ష్మి మృతిపై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పూడ్చి పెట్టిన శవానికి పోస్టుమార్టం చేయగా మహాలక్ష్మిని హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అనంతరం పోలీసుల దర్యాప్తులో అదేకాలనీకి చెందిన నాగిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి మహాలక్ష్మిని గొంతు నొక్కి హత్య చేసి ఆమె మెడలోని చైన్, వేలి ఉంగరం దొంగిలించినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు మహాలక్ష్మి బంధువు సలాది సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గోకవరం: రోడ్డు ప్రమాదంలో పెంటపల్లికి చెందిన సాత్నబోయిన దుర్గాప్రసాద్ (23) మృతి చెందాడు. ఆ వివరాల ప్రకారం.. గోకవరంలో సినిమా చూసేందుకు టిక్కెట్ల కోసం దుర్గాప్రసాద్ బైక్‌పై వచ్చాడు. టిక్కెట్లు తీసుకున్న అనంతరం తన స్నేహితుడిని సినిమాకు తీసుకు వచ్చేందుకు వీరలంకపల్లి వెళ్తుండగా గోకవరంలో పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని 108 వాహనంలో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి తల్లి, తండ్రి ఉన్నారు. చేతికందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment