సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం వద్ద నుంచి పాల కావిళ్లతో బయల్దేరిన భక్తులు, బాలలు
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయానికి ఉపాలయమైన చెరువువీధిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాల కావిడి ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష పూజలు జరిపారు. అనంతరం పాల కావిళ్లలో సుగంధ ద్రవ్యాలను ఉంచి భక్తులకు అందించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పాల కావిళ్ల గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి ముందు భక్తులు స్వామివారి పాల కావిళ్లకు హారతులిచ్చారు. తిరిగి ఆలయానికి చేరుకున్న పాల కావిళ్లలోని సుగంధ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారి మూలవిరాట్‌్‌కు అభిషేకాలు జరిపారు. ఈ వేడుకలో పెద్దలతో పాటు చిన్నారులు, బాలలు సైతం సంప్రదాయ దుస్తుల్లో పాల కావిళ్లను మోయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కావిళ్లను మోయడం ద్వారా సర్వదోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఆలయంలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసన వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment