ఏలూరులో డ్రోన్ సమ్మిట్
ఏలూరు టౌన్: ప్రజల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న అత్యాధునిక డ్రోన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఐడియా ఫోర్జ్ డ్రోన్ ఫ్రాంచైజ్ మోడల్ ఫ్‌లైట్‌ను ఎస్పీ శివకిషోర్, జేసీ ధాత్రి రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ సమావేశ మందిరంలో మినీ డ్రోన్ సమ్మిట్‌ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక డ్రోన్స్ వినియోగం, సాంకేతికత, భద్రతా పరమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీస్ అధికారులకు ఫ్రాంచైజ్ నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రీతిలో భద్రత కల్పించడం, ఆటోమేటెడ్ చలాన్ విధానానికి డ్రోన్స్‌ను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీ పర్యవేక్షణ, వీఐపీ భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్నీ పరిశీలించడం, క్రౌడ్ మేనేజ్‌మెంట్, నేర నివారణ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోలింగ్, అక్రమ రవాణాపై నిత్యం నిఘా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ చెప్పారు. జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహించారనీ, దానిలో భాగంగా ఏలూరులో మినీ డ్రోన్ సమ్మిట్ ఏర్పాటు చేయటం శుభపరిణామం అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ భూ సర్వేలలో డ్రోన్స్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. భవన నిర్మాణ అనుమతుల నుంచి ప్రతి అంశంలోనూ డ్రోన్స్‌ను ఉపయోగించుకుంటే సులభతరం అవుతుందన్నారు. ఈ సమ్మిట్‌కు ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు, అటవీశాఖ, రవాణాశాఖ అధికారులు, ఎస్‌బీ సీఐలు మల్లేశ్వరరావు, బీ.ఆదిప్రసాద్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర, పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐలు, ఎస్సైలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment