బైక్ ఢీకొని పాదచారుడి మృతి
నరసాపురం రూరల్: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరుపాలెం సౌత్ గ్రామంలో ఓ పాదచారుడిని బైక్ ఢీకొనడంతో మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బెల్లంకొండ సత్యనారాయణ (51) ఆదివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఎదురుగా మోటార్‌సైకిల్ వచ్చి ఢీకొంది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. సత్యనారాయణ కుమారుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బండి సత్యనారాయణ తెలిపారు.
హాకీ పోటీల్లో విద్యార్థికి బంగారు పతకం
భీమవరం: విశాఖపట్టణంలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ హాకీ సీనియర్ విభాగంలో భీమవరంలోని సీతా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి జి.విష్ణురాజు బంగారు పతకం సాధించాడు. త్వరలో కోయంబత్తూరులో జరిగే నేషనల్ రోలర్ హాకీ సీనియర్ విభాగంలో విష్ణురాజు పాల్గొంటాడని కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రామకృష్ణ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల డైరెక్టర్ జి.శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్ జీబీఎస్ కుమార్ రాజు, తదితరులు అభినందించారు.
వీధికుక్క దాడిలో నలుగురికి గాయాలు
ద్వారకాతిరుమల: స్థానిక శివాలయం ఆర్చిగేటు కూడలిలో ఒక వీధి కుక్క సోమవారం స్త్వెర విహారం చేసి నలుగురిని గాయపర్చింది. స్థానికుల కథనం ప్రకారం. శ్రీవారి దేవస్థానంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తొంటపాక శ్రీను శివాలయం ఆర్చిగేటు వైపు నుంచి తన ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. ఆ సమయంలో ఒక వీధి కుక్క వెంబడించి మరీ అతడి కాలిపై కరిచింది. అదేవిధంగా దేవస్థానంలో కాంట్రాక్టరుగా పనిచేస్తున్న మాడుగుల సీతారామయ్య, తిమ్మాపురంలోని సన్‌రైజ్ దాబా నిర్వాహకుడు బీర దిలీప్, అలాగే శ్రీను అనే మరో యువకుడిపై శునకం దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన బాధితులు స్థానిక పీహెచ్‌సీకి వెళ్లి చికిత్స పొందారు. దాడులకు పాల్పడుతున్న వీధి కుక్కల భారి నుంచి ప్రజలకు, భక్తులకు రక్షణ కల్పించాలని పంచాయతీ అధికారులను పలువురు కోరుతున్నారు.
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
ఉండి: లారీ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి మండలం యండగండికి చెందిన నేతింటి అప్పారావు(71) సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో స్థానికంగా ఉన్న పిప్పర రోడ్డుపై నిలిపి ఉంచిన లారీ వెనుక మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది గమనించని లారీ డ్రైవర్ లారీని రివర్స్ చేయడంతో లారీ వెనుకనే మూత్ర విసర్జన చేస్తున్న అప్పారావుపైకి లారీ వెనుక ఎడమవైపు చక్రం ఎక్కడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పారావు కుమారుడు రాజారావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment