ఆగని వసూళ్ల పర్వం
ముసునూరు మండలంలో కొనసాగుతున్న ఇసుక దందా
ముసునూరు: మండలంలోని వలసపల్లి, యల్లాపురం గ్రామాల్లో ఇసుక రీచ్‌ల వద్ద అక్రమ వసూళ్ల పర్వం ఆగకపోగా ఇంకా కొనసాగుతూనే ఉంది. రీచ్‌ల ప్రారంభ సమయంలో మంత్రి పార్థసారథి చెప్పిన మాటలను పెడ చెవిన పెట్టి, ఇసుక ట్రాక్టర్ల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. యల్లాపురంలో స్థానికులు కాకుండా, పొరుగు ఊళ్ళ నుంచి వచ్చిన ప్రతి ట్రాక్టర్ యజమానుల నుంచి రూ.100 వరకు ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసి, దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీచ్ లోపలకు వెళ్ళి ఇసుక లోడు చేసుకుని వచ్చేందుకు వీలుగా జేసీబీతో దారి వేయించామని, దీని ఖర్చుల నిమిత్తం అంటూ పంచాయతీ పేరు చెప్పి ప్రతి ట్రాక్టర్ ట్రక్కుకు రూ. 100గా వసూలు చేస్తున్నట్లు ట్రాక్టర్ యజమానులు పేర్కొంటున్నారు. దీంతో ఉచిత ఇసుక పంపిణీ అందని ద్రాక్షగా మారి, అభాసు పాలైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కొందరు ఓనర్లు అధికార పార్టీ అండను, పరపతిని ఉపయోగించి, తనకున్న ట్రాక్టర్లన్నింటితో రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుకను సేకరించి, గృహావసరాలు కాకుండా, నూజివీడు, విసన్నపేట, హనుమాన్ జంక్షన్ పట్టణాలకు తరలించి రూ.5,000 నుంచి రూ.7,000 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రకరకాల పేర్లతో చేస్తున్న ఇసుక దోపిడీని నిలువరించి, పేదల గృహ నిర్మాణాలకు ఇసుక ఉచితంగా అందేలా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ.. అధిక వసూళ్ల విషయం తమ దృష్టికి రాలేదని, బుధవారం రీచ్‌లకు వెళ్లి విచారించి తక్షణ చర్యలు చేపడతామని తహసీల్దార్ పురుషోత్తమ శర్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment