ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..
చింతలపూడి: చింతలపూడి పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తల్లీ, బిడ్డ మృతి చెందారు. వెంకటాపురం గ్రామానికి చెందిన కోడూరి పరిమళా కిరణ్(25) ఈ నెల 27న పురిటి నొప్పులతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అర్ధరాత్రి ప్రసవం కాగా శిశువు మృతి చెందింది. బాలింతరే తీవ్ర రక్త స్రావం అవుతుండటంతో వైద్యుల సూచన మేరకు 28న విజయవాడ తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం మహిళ మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఆసుపత్రిలోని నర్సులు ప్రసవం చేయడంతో తల్లీబిడ్డ మృతి చెందారని ఆరోపించారు. సీఐ రవీంద్ర నాయక్ సంఘటనా స్ధలానికి చేరుకుని బాధితులను విచారిస్తున్నారు. డీఎంహెచ్‌ఓ డా.శర్మిష్ట ఆసుపత్రికి వచ్చి సంఘటనపై విచారణ జరిపారు. తల్లీబిడ్డ మృతి ఘటనలో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నిబంధనలు పాటించాలి
ఏలూరు టౌన్: ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మంగళవారం తనిఖీ చేశారు. అనుమతి పత్రాలను పరిశీలించారు. ఇష్టారాజ్యంగా దుకాణాలు పెడితే సహించబోమని, అగ్నిమాపక శాఖ నిబంధనలు విధిగా పాటించాలని, నిత్యం పర్యవేక్షణ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. షాపుల వద్ద ప్లాస్టిక్ వస్తువులకు అనుమతిలేదని, విద్యుత్ సరఫరా విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించేలా క్రాకర్లు కాల్చవద్దని హితవు పలికారు. అనధికారికంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసినా, విక్రయాలు చేసినా ఫిర్యాదు చేయాలని కోరారు.
అభివృద్ధి పనులకు నాణ్యత లేని ఇసుక
కొయ్యలగూడెం: పనికిరాకుండా ఉన్న ఇసుకను గోదావరి ఇసుక అని అనడం ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారికే చెల్లింది. కొయ్యలగూడెం మండలంలో అమలు అవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పనులు నాణ్యత లోపాలతో ఉన్నాయంటూ ప్రజలు విమర్శిస్తున్న నేపథ్యంలో కొందరు ప్రజాప్రతినిధులు, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా పనుల్లో వినియోగించాల్సిన ఇసుక నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కాంక్రీట్‌లోకి వాడాల్సిన ఇసుక అత్యంత అధ్వానంగా ఉంది. నాణ్యత లేని ఇసుకను వాడి పనులను పూర్తి చేసిన ఓ వర్క్ గురించి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలోని ఓ అధికారి దృష్టికి తీసుకువెళ్లగా పనులకు ఉపయోగించింది గోదావరి ఇసుకే అని చెప్పడం విడ్డూరం. దీనిపై ఎంపీడీవో కె.కిరణ్ కుమార్‌ను ప్రశ్నించగా.. పనిని స్వయంగా వెళ్లి పర్యవేక్షిస్తానని తెలిపారు.
వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నగరపాలక, పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, సమాన కేడర్ ఉన్న ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు పదోన్నతులు కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment