సుబ్బారాయుడి కల్యాణోత్సవాలకు సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కల్యాణోత్సవాలకు ముస్తాబైంది. ఆలయం, పరిసరాలు విద్యుత్ అలంకారాలతో మిరమిట్లు గొలుపుతున్నాయి. ఇప్పటికే అన్ని పనులు పూర్తి కాగా, ఆలయ ముఖ ద్వారాలను ముస్తాబు చేసే పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా, తొలిరోజు ఉదయం 9.30 గంటలకు అర్చకులు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలు చేస్తారు. 5న పుణ్యహవాచనం, అంకురార్పణ, రాత్రి ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 6న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసన నిర్వహిస్తారు. 7న రాత్రి 7 గంటల నుంచి ఆలయం వద్ద శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. 8న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసన, సాయంత్రం నెమలి వాహనంపై గ్రామోత్సం, 9న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసన, బలిహరణ, పూర్ణాహుతి, అవబృధస్నానం, వసంతోత్సవం, ధ్వజావరోహణ వేడుకలను నిర్వహిస్తారు. 10న సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ద్వాదశి ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగోత్సవ వేడుకలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment