విలువిద్యలో జయకేతనం
చింతలపూడి: రాజమండ్రి ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర కళాశాలల విలువిద్య పోటీలలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి టీం చాంపియన్ షిప్ సాధించారు. వ్యక్తిగత విభాగంలో వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించి ఆరుగురు విద్యార్థులు విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 24 నుంచి 27 వరకు భువనేశ్వర్‌లో జరిగే ఆలిండియా విశ్వవిద్యాలయాల ఆర్చరీ పోటీల్లో నన్నయ విశ్వవిద్యాలయం తరఫున పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ డా పి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
డ్రైవర్‌కు జైలుశిక్ష
నూజివీడు : కారును నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ దేవతల శ్రీనివాసరావుకు మూడు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2019 ఫిబ్రవరి 21న రాజమండ్రి నుంచి 25 మంది మత్స్యకార కూలీలు డీసీఎం వ్యాన్‌లో జగ్గయ్యపేటకు వెళ్తూ భోజనం చేయడానికి హనుమాన్‌జంక్షన్ సమీపంలో ఉన్న బొమ్ములూరు వద్ద వ్యాన్ ఆపారు. నల్లమల గోపాలం భోజనానికి రోడ్డు దాటుతుండగా ఏలూరు నుంచి వస్తున్న డ్రైవర్ శ్రీనివాసరావు కారును నిర్లక్ష్యంగా నడిపి గోపాలాన్ని ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై మృతి చెందాడు. దీనిపై హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ స్పెషల్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.
15న స్వర్ణకార సంఘ సమావేశం
ఆకివీడు: స్వర్ణకార వృత్తి పనివాళ్లకు బీసీ కార్పొరేషన్ నిధులు, ఇతర సంక్షేమ పథకాలు అమలుజేయాలని ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పట్నాల శేషగిరిరావు, నల్లగొండ వెంకట రామకృష్ణలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా సంఘ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ ఈ నెల 15న నర్సాపురంలో ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. స్వర్ణకార, విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై చర్చించి, పరిష్కారం కోసం ప్రభుత్వానికి తీర్మానాలు పంపుతామని చెప్పారు. స్వర్ణకార ఫెడరేషన్‌లో సంఘ సభ్యుల్ని డైరెక్టర్లుగా నియమించాలని, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌లో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల్ని డైరెక్టర్లుగా నియమించాలని, దేవాలయ కమిటీల్లో విశ్వబ్రాహ్మణుల్ని డైరక్టర్లుగా నియమించాలని కోరతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment