నరసాపురం: నరసాపురం గోదావరి గట్టున దశాబ్దాలుగా చెత్తను డంప్ చేయడంపై సామాజికవేత్త ఓసూరి దేవేంద్రఫణికర్ జాతీయ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో శుక్ర వారం మండలి సౌత్‌జోన్ రీజినల్ డైరెక్టర్ హెచ్‌డీ వరలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన బృందం దర్యాప్తు చేపట్టారు. వరలక్ష్మితో పాటు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కేవీ రావు, శాస్త్రవేత్తలు సౌమ్య, సుకృతతో కూడిన బృందం పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. డంపింగ్ యార్డును పరిశీలించి స్థానికులు ఏ నీటిని తాగుతున్నారనే పలు విషయాలను ఆర్డీవో దాసి రాజు, మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యలను అడిగి తెలుసుకున్నారు. తానే 10 నిమిషాలు ఇక్కడ ఉండలేకపోతున్నానని.. జనం ఎలా బతుకుతున్నారని వరలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. గోదావరికి సమీపంలోని శ్శశాన వాటిక, ప్రైవేట్ స్కూల్‌ను పరిశీలించారు. పలువురు స్థానికులతో మాట్లాడారు. డంపింగ్ యార్డు ప్రాంతంలో మట్టిని, తాగునీటిని బృందం సేకరించింది. గాలి నాణ్యతను పరీక్షించేందుకు మూడుచోట్ల యంత్రాలు అమర్చారు. బృందం శనివారం కూడా తనిఖీలు చేయనుంది. పూర్తి నివేదికను ఢిల్లీలో తెలియజేస్తానని వరలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment