అలిగిన రొయ్య!
ఆకివీడు: రొయ్య.. అలిగింది.. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇది అక్షర సత్యం. గత 15 రోజులుగా రొయ్యలు మేతలు తినక పోవడంతో ఎదుగుదల పడిపోయింది. ఎన్ని మందులు చల్లినా ఫలితం దక్కడం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపత్యంలో రొయ్యల సాగుకు ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలికి తోడు మబ్బులు, చిరుజల్లులతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోయింది. దీంతో రొయ్యలకు సక్రమంగా ఆక్సిజన్ అందడం లేదు. ప్రతి క్షణం ఏరియేటర్లు తిరుగుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రత 23 డిగ్రీలకు పడిపోయింది. ఒక్కోసారి 18–20 డిగ్రీలకు పడిపోతుంది. చల్లటి వాతావరణంలో రొయ్యలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఆక్సిజన్ అందకపోవడంతో రొయ్యలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. నెలా పదిహేను రోజుల నుంచి పెంపకం కొనసాగుతున్నా రొయ్యల్లో ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంది. మేతలు వృథాగా మట్టిలో కలిసిపోతున్నాయి. 200 నుంచి 150 కౌంటులో ఉన్న రొయ్యలకు వైరస్ సోకితే పట్టేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పడిపోయిన రొయ్య ధర
వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రొయ్యల వ్యాపారులు ధరలను ఒక్కసారిగా తగ్గించి వేశారని రైతులు వాపోతున్నారు. రొయ్యల్లో ఎదుగుదల లేకపోవడం, వైరస్ సోకడంతో 100 కౌంట్ ధర రూ.265 నుంచి రూ.250లకు పడిపోయిందంటున్నారు. దళారుల బెడదతో ధరలు తగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు, దళారులు ఇష్టానుసారం ధరలు తగ్గిస్తూ, పెంచుతూ నిలకడ లేకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేత తినకపోవడంతో మందగించిన ఎదుగుదల
లబోదిబోమంటున్న ఆక్వా రైతులు
Comments
Please login to add a commentAdd a comment