సంక్రాంతి చుట్టాలకు బస్సులు రెడీ | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతి చుట్టాలకు బస్సులు రెడీ

Published Sat, Dec 21 2024 12:56 AM | Last Updated on Sat, Dec 21 2024 12:56 AM

సంక్ర

సంక్రాంతి చుట్టాలకు బస్సులు రెడీ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సంక్రాంతి పండుగంటే గోదావరి జిల్లాల్లో సందడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో పిండి వంట ఘుమఘుమలతో పాటు పంట చేతికందగానే రైతులు చేసే రైతు పండుగ కాబట్టి గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ పెట్టింది పేరు. కాబట్టి సొంతూళ్లకు దూరంగా ఉన్న వారు కచ్చితంగా సంక్రాంతికి సొంతింటికి చేరుకుని ఉల్లాసంగా పండుగ జరుపుకుంటారు. జిల్లాకు చెందిన ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం, వ్యాపార రంగాల్లో స్థిరపడడంతో అక్కడి నుంచే జిల్లాకు వచ్చే జనాభా వేలల్లో ఉంటారు. వారందరినీ జిల్లాకు తీసుకురావడానికి ఆర్టీసీ ఇప్పటి నుంచే సిద్ధం అవుతుంది.

ప్రత్యేక సర్వీసులు ఇలా

పండుగ నిమిత్తం హైదరాబాద్‌ నుంచి జిల్లా ప్రజలను తీసుకురావడానికి, పండుగ అనంతరం వారిని తిరిగి గమ్య స్థానాలకు చేర్చడానికి ఉమ్మడి పశ్చిమ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుంది. వీటిలో ఏలూరు జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి జనవరి 9 నుంచి హైదరాబాద్‌ నుంచి తీసుకురావడానికి, 15 నుంచి హైదరాబాద్‌కు తరలించడానికి మొత్తం 93 బస్సులను ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రక్రియ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం డిపోల నుంచి మొత్తంగా ప్రతి నిత్యం 20 ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచారు. ఇవి కాక ఏలూరు జిల్లా నుంచి ఏడాది పొడవునా ప్రతి రోజూ తిరిగే రెగ్యులర్‌ షెడ్యూల్‌ బస్సులతో పాటు మరో 29 అందుబాటులో ఉంటాయి. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తిరిగే 20 రెగ్యులర్‌ షెడ్యూల్‌ బస్సులు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

సాధారణ టిక్కెట్‌ ధరలే వసూలు

గతంలో పండుగల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సర్వీసుల్లో ప్రయాణికుల నుంచి 50 శాతం అధికంగా టిక్కెట్‌ ధరలు వసూలు చేసేవారు. దీంతో ప్రయాణికులు తమకు అందుబాటులో ఉన్న వాహనాల్లో అంటే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, ట్యాక్సీలు, రైళ్లు తదితర వాహనాల్లో వెళ్లేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవారు. దీనిపై సర్వత్రా వచ్చిన విమర్శలు రావడం, ఆర్టీసీ ఆదాయానికి గణనీయంగా గండి పడిన నేపథ్యంలో గత ఏడెనిమిదేళ్ల నుంచి సాధారణ టిక్కెట్‌ ధరలతో ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది.

గతేడాది సంక్రాంతి ఆదాయం రూ. 1.29 కోట్లు

గతేడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 డిపోల నుంచి నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా ఆర్టీసీ రూ. 1.29 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది. దీంట్లో ఏలూరు జిల్లా నుంచి మొత్తం 307 ప్రత్యేక బస్సులను తిప్పారు. వాటిలో 144 హైదరాబాద్‌ నుంచి జిల్లాకు, 163 జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిప్పారు. వీటి ద్వారా మొత్తం 15590 మంది ప్రయాణం చేయగా 76,36,712 ఆదాయం వచ్చింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 డిపోల నుంచి హైదరాబాద్‌ నుంచి జిల్లాకు 88 బస్సులు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు 104 బస్సులు తిప్పారు. దీని ద్వారా మొత్తం 6 వేల మంది ప్రయాణించగా రూ. 53,16000 ఆదాయం వచ్చింది.

టిక్కెట్‌ ధరల పెంపు లేకుండానే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక సర్వీసులు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు డిపోల నుంచి సేవలు

పది శాతం రాయితీ..

హైదరాబాద్‌ నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఒకే సారి రానుపోనూ టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకుంటే టిక్కెట్‌ ధరలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నాం. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల ప్రజలకు ఇప్పటి నుంచే రిజర్వేషన్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. సూపర్‌ లగ్జరీ బస్సులతో పాటు అల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అందుబాటులో ఉంచాం. డిమాండ్‌ ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తాం.

– ఎన్‌వీఆర్‌ వర ప్రసాద్‌, ఏలూరు జిల్లా ఇన్‌చార్జ్‌ ప్రజా రవాణా అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
సంక్రాంతి చుట్టాలకు బస్సులు రెడీ 1
1/1

సంక్రాంతి చుట్టాలకు బస్సులు రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement