హోం మంత్రిని బర్తరఫ్ చేయాలి
ఏలూరు (టూటౌన్): అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పాతబస్టాండ్ సెంటర్‌లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహంవద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు. నేర చరిత్ర కలిగిన అమిత్ షా భారత దేశ రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కురెళ్ల వరప్రసాద్, కొండేటి బేబి, భజంత్రీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు. నిరసనలో చాగంటి సంజీవ్, పల్లెం ప్రసాద్, నేతల రమేష్ బాబు, మేతర అజయ్ బాబు, దాసరి నాగేంద్ర కుమార్, కాపుదాసి రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment