ధర్మ రక్షణకే హిందూమతం పుట్టుక
కాళ్ల/ఆకివీడు: ధర్మాన్ని రక్షించడానికి హిందూమతం పుట్టిందని గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. విశ్వధర్మ విజయ యాత్రలో భాగంగా క్షేత్ర యాత్ర నిర్వహిస్తున్న దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శుక్రవారం సాయంత్రం కాళ్ల గ్రామంలోని దత్తపాదుకా క్షేత్రానికి విచ్చేశారు. దీనిలో భాగంగా గ్రామానికి చెందిన సుమారు 200 మందికి పైగా మహిళలతో సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా సచ్చితానంద స్వామజీ భక్తులకు ప్రవచనాలను బోధించారు. కార్యక్రమంలో పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, గోళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం ఆకివీడులోని దత్త క్షేత్రాన్ని సందర్శించి, క్షేత్ర అభివృద్ధికి రూ. 55 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ సొమ్మును అందజేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎంతో పుణ్యం చేసుకుంటేనే భారతదేశంలో పుడతారన్నారు. చిన్న స్వామీజీ విజయానంద, దత్త క్షేత్ర కార్యదర్శి కంభంపాటి త్రినాథ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
యువకుడి అదృశ్యంపై కేసు
ముదినేపల్లి రూరల్: బంగారం తాకట్టు పెట్టిన సొమ్ముతో సంక్రాంతి పండుగ రోజున ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాలేదని యువకుడి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిగురుకోట గ్రామానికి చెందిన బత్తుల వీరహనుమాన్(33) పండుగ రోజున కైకలూరు వెళ్లి తన భార్య బంగారపు చైనును తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బును తీసుకుని బయటకు వెళ్లాడు. అనంతరం హనుమాన్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో హనుమాన్ సోదరుడు శరత్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరభద్రరావు తెలిపారు.
రైతు నాయకుడు
రాఘవరెడ్డి మృతి
పెంటపాడు: పెంటపాడుకు చెందిన రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడు, సర్ ఆర్దర్ కాటన్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డుగ్రహీత నల్లమిల్లి వీరరాఘవరెడ్డి (76) శుక్రవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమారుడు నల్లమల్లి అంజిరెడ్డి వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు. రాఘవరెడ్డి ముదునూరు సొసైటీ అధ్యక్షుడిగా సేవలను అందించారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషికి గాను స్వాతంత్య్ర, గణతంత్య్ర వేడుకలలో అప్పటి సీఎంలు అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డులు పొందిన ఘనత ఉమ్మడి జిల్లాలో రాఘవరెడ్డికే ఉంది. ఆయన మృతివార్త తెలుసుకొన్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, అప్సడా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డి రఘురాం రాఘవరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతి రైతాంగానికి తీరని లోటన్నారు.
రైలు కింద పడి
వ్యక్తి ఆత్మహత్య
భీమవరం: పాలకొల్లు మండలం లంకలకోడేరు పంచాయతీ వెదుళ్లపాలెం గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వరరావు (66) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భీమవరం రైల్వే ఎస్సై రమణ తెలిపారు. శుక్రవారం ఉదయం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద నాగర్ సోల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment