శోభనాచల స్వామికే శఠగోపం!
రథసప్తమి ఉత్సవాల పేరుతో దేవుడి పేరు చెప్పి దోచుకునేందుకు ఆగిరిపల్లిలో కొందరు బయలుదేరారు. గత 20 ఏళ్లుగా చందాలు వసూలు చేస్తూ దండుకుంటున్న వ్యక్తుల చర్యలకు రెండేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు జోక్యంతో ఫుల్‌స్టాప్ పడింది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరలా దేవుడి పేరుతో చందాలు వసూలు చేసి బొక్కేందుకు కొందరు పథక రచన చేస్తున్నారు.
మళ్లీ దోపిడీ పర్వానికి రెడీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏటా రథసప్తమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ప్రాచీన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. నూజివీడు జమిందారులు మేకా అప్పరాయ వంశీయులు ఆగిరిపల్లిలోని శోభనగిరిపై ఆలయాన్ని నిర్మించారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. శివకేశవులు ఒకేచోట కొలువై ఉండటం క్షేత్ర ప్రత్యేకత. ఆలయ నిర్వహణకు మేకా వంశీయులు వేలాది ఎకరాల ఆస్తులు, బంగారు ఆభరణాలను స్వామి వారికి కానుకగా సమర్పించారు. ఇప్పటికీ మేకా వంశీయుల వారసులే స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను ఈనెల 30 నుంచి వచ్చేనెల 8 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. రథసప్తమి రోజున దాదాపు లక్ష మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో రథసప్తమి పేరుతో దోపిడీ పర్వానికి తెరలేపేందుకు కొందరు సన్నాహాలు చేస్తున్నారు.
రెండేళ్లుగా పారదర్శకంగా..
ఆగిరిపల్లికి చెందిన కొందరు 20 ఏళ్లుగా రథసప్తమి రోజున అన్నదానం నిర్వహణ నిమిత్తం అనధికారికంగా చందాలు వసూలు చేసి రశీదులు కూడా ఇచ్చేవారు కాదు. చందాలకు సంబంధించి జమాఖర్చులు చెప్పకుండా అయినకాడికి దండుకున్నారు. దీంతో రెండేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అక్రమ చందాల వసూలుకు చెక్ పెట్టారు. గ్రామంలోని పెద్దలతో నూతన కమిటీని ఏర్పాటు చేసి రథసప్తమి సందర్భంగా అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే కాకినాడలోని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌తో చర్చించి అధికారికంగా అనుమతులు తీసుకుని అన్నదానం పేరుతో ఆలయ ఈఓతో బ్యాంకు ఖాతాను తెరిపించారు. చందాలు ఇచ్చిన వారందరికీ ఆలయ ఈఓ సంతకంతో కూడిన దేవదాయశాఖ రశీదులను అందజేశారు. ఇలా వసూలు చేసిన మొత్తంతో అన్నదానం నిర్వహించి, ఖర్చులు పోను రెండేళ్లకు కలిపి దాదాపు రూ.5.75 లక్షలు మిగులు ఉండగా వీటిని బ్యాంకు ఖాతాలో జమచేశారు. దోపిడీకి, దుర్వినియోగానికి ఎక్కడా ఆస్కారం లేకుండా ప్రతిదీ పారదర్శకంగా నిర్వహించి కమిటీ సభ్యులు అందరి మన్ననలు పొందారు.
రథసప్తమి వేడుకల పేరుతో దోపిడీకి పథక రచన
రెండేళ్ల క్రితం అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
మళ్లీ తెరపైకి చందా.. దందా
వసూళ్ల పేరుతో బొక్కేందుకు కూటమి నేతల ప్రయత్నాలు
రెండేళ్ల క్రితం చెక్ పడిన దోపిడీ పర్వాన్ని టీడీపీ అధికారంలోకి రావడంతో కొందరు మరలా తెరపైకి తెస్తున్నారు. గతంలో చందాలు వసూలు చేసి, విరాళాలు ఇచ్చిన వారికి రశీదులు ఇవ్వకుండా, సొమ్ముకు సంబంధించి వివరాలేవీ చెప్పకుండా మెక్కేసిన కొందరు ఈ ఏడాది మళ్లీ రథసప్తమి పేరుతో చందాలు వసూలుకు పావులు కదుపుతున్నారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా దేవుడి కార్యక్రమాన్ని తమ దోపిడీకి అనుకూలంగా మల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఆలయ ఈవోకు గాని, ప్రధాన అర్చకులకు గాని సమాచారం లేకుండా రథసప్తమికి చందాలు వసూలు నిమిత్తం ఇటీవల రెండుసార్లు సమావేశమయ్యారు. సమావేశానికి కొత్త కమిటీకి చెందిన వారు కూడా కొందరు వెళ్లారు. చందాలు వసూలు చేయాలనే తప్ప, రశీదులు ఇవ్వాల్సిన పనిలేదని కొందరు మాట్లాడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చందాల విషయంలో జవాబుదారీతనం, పారదర్శకత లేకపోతే గతంలో మాదిరిగానే మరలా దోపిడీ పర్వం కొనసాగుతుందనే ఆందోళనను ఆగిరిపల్లి గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. కొత్త కమిటీ రెండేళ్లు నిర్వహిస్తేనే రూ.5.75 లక్షలు మిగిలినప్పుడు గత 20 ఏళ్లుగా నిర్వహించిన వ్యక్తులు ఇప్పటివరకు ఎంత మిగిలాయనే విషయాన్ని తెలపలేదని, భగవంతుడు పేరు చెప్పుకొని వసూళ్లకు పాల్పడటం దారుణమని, ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. గత 20 ఏళ్లుగా వచ్చిన సొమ్ములో మిగిలిన సొమ్మును స్వాధీనం చేసుకుని దేవుడి బ్యాంకు ఖాతాలో వేయాలని గ్రామస్తులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment